శ్రీకాకుళం టీడీపీలో గ్రూప్‌వార్.. ఆందోళనలో కార్యకర్తలు
ఎన్నికల వేళ ఈ ఆధిపత్య పోరుకు ఫుల్‌స్టాప్ పెట్టకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు కార్యకర్తలు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ఈ గ్రూప్‌వార్‌ను ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సివుంది.

Srikakulam TDP Group War
Srikakulam TDP : ఎన్నికలకు సమయం సమీపిస్తుంటే.. సిక్కోలు టీడీపీలో విభేదాలు ఎక్కువవుతున్నాయి. అధినేత చంద్రబాబు ‘రా కదలిరా’ అంటూ భారీ బహిరంగ సభలతో క్యాడర్‌లో ఉత్తేజం తెస్తుంటే.. స్థానిక నేతలు నడిరోడ్డుపైనే బలప్రదర్శనకు దిగుతున్నారు. టీడీపీకి చావోరోవే తేల్చుకోవాల్సిన ఎన్నికల్లో ఈ గ్రూపు ఫైట్ ఆసక్తికరంగా మారింది.
శ్రీకాకుళంలోనూ తప్పని ఓటమి..
ఏపీలో టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాలో శ్రీకాకుళం ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో టీడీపీ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల్లో ఫ్యాన్ సునామీతో సీట్లు తగ్గినా.. క్యాడర్, లీడర్ల బలం మాత్రం చెక్కుచెదరలేదు. ఇక జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోనూ అంతే.. 1983 నుంచి 2004 వరకు టీడీపీకి ఎదురేలేదన్నట్లు వరుస విజయాలు సాధించింది. 2004, 2009లో కాంగ్రెస్ హవాలోనూ.. గత ఎన్నికల్లో వైసీపీ గాలితో శ్రీకాకుళంలోనూ ఓటమి తప్పలేదు. ఈ పరిస్థితుల్లో మరికొద్ది రోజుల్లో జరగాల్సిన ఎన్నికలను సవాల్‌గా తీసుకుంది టీడీపీ.
మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి వర్గంలో కలవరం..
అయితే గతంలో ఎప్పుడూ లేనట్లు ప్రస్తుతం సిక్కోలు టీడీపీలో వర్గ విభేదాలు ఎక్కువైపోయాయి. ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధిపత్యమే ఇన్నాళ్లు కొనసాగేది. కానీ, ఇప్పుడు వారి నాయకత్వానికి యువనేతల నుంచి సవాల్ ఎదురవుతోంది. మాజీమంత్రి అప్పలసూర్యనారాయణకు వయోభారంతో ఆయన స్థానంలో లక్ష్మీదేవికి 2014, 2019 ఎన్నికల్లో పోటీకి నిలిపింది టీడీపీ అధిష్టానం.
అయితే ఈసారి ఆమెకు పోటీగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వర్గానికి చెందిన సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్ టికెట్ ఆశిస్తున్నారు. యువకుడైన శంకర్ దూకుడుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వర్గంలో కలవరం మొదలైంది.
Also Read : వైసీపీ ఏడో జాబితాపై ఉత్కంఠ.. టెన్షన్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు
పార్టీ పరువు బజారును పడుతోందని ఆగ్రహం..
తాజాగా ‘గడప గడపకు శంకర్’ అనే పేరుతో శ్రీకాకుళం నగరంలో గొండు శంకర్ పాదయాత్ర చేయడం వివాదాస్పదమవుతోంది. నియోజకవర్గ ఇన్‌చార్జి, శ్రీకాకుళం పట్టణ, మండల పార్టీల అధ్యక్షులు ఎవరూ లేకుండా పార్టీ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని శంకర్‌ను నిలదీస్తున్నారు నేతలు. నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఓ అడుగు ముందుకేసి శంకర్ పాదయాత్ర చేయకుండా అడ్డుకోవడం వివాదాస్పదమైంది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో పార్టీ పరువు బజారును పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు.
మూల్లం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక..
శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. ఇన్నాళ్లు గుండ కుటుంబమే పార్టీకి అన్నీతామై చూసుకున్నారు. ఇప్పుడు కొత్తతరం లేవడంతోనే సమస్య వస్తోందని అంటున్నారు పార్టీ పరిశీలకులు. ఎన్నికల వేళ ఈ ఆధిపత్య పోరుకు ఫుల్‌స్టాప్ పెట్టకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు కార్యకర్తలు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ఈ గ్రూప్‌వార్‌ను ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సివుంది.