చౌక బేరం : పక్కరాష్ట్రంలో కిలో ఉల్లి రూ.25

  • Publish Date - September 25, 2019 / 06:40 AM IST

దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఉల్లి కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది. రోజు రోజుకు ఉల్లి రేటు పెరిగిపోతోంది. ప్రస్తుతం కిలో ఉల్లిపాయలు రూ.50 కి పై మాటే. కొన్ని చోట్ల వీటి రేటు రూ.60 కూడా దాటింది. దీంతో సామాన్యుడు ఉల్లి కొనలేని పరిస్థితి ఉంది. ప్రజల ఇబ్బందులు తీర్చటానికి, తక్కువ రేటుకు ఉల్లిపాయలను అందించేందుకు జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహారాష్ట్ర నుంచి తెప్పించిన 300 టన్నుల ఉల్లిపాయలను కిలో రూ. 25 చొప్పన రైతు బజార్లలో విక్రయించనున్నారు. గురువారం(సెప్టెంబర్ 25,2019) నుంచి రైతుబజార్లలో వీటిని విక్రయిస్తామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యమ్న తెలిపారు.

అధికారుల నిర్ణయం వినియోగదారులకు కాస్త రిలీఫ్ ఇచ్చింది. కాగా, ఉల్లి ధరలు పెరగడానికి వర్షాలే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్రతో పాటు ఉల్లిని ఎక్కువగా సాగుచేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతింది. డిమాండ్ కి తగ్గ సప్లయ్ లేకుండా పోయింది. దాంతో ఉల్లి ధరలు భగ్గుమన్నాయి. పెరిగిన ఉల్లి ధరలతో సామాన్యులు పరేషాన్ అవుతుంటే.. ఉల్లి రైతులు మాత్రం హ్యాపీగా ఉన్నారు. పెరిగిన ఉల్లి ధరల పట్ల తెలుగు రాష్ట్రాల్లోని ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా నష్టపోయామని ఈసారైనా మద్దతు ధర లభించడం సంతోషంగా ఉందని చెబుతున్నారు.