సచివాలయం భవనంపై జాతీయ జెండా రంగులు మార్చిన ఘటనలో సెక్రటరీ సస్పెండ్

  • Publish Date - October 31, 2019 / 02:18 AM IST

అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడేపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆర్‌. ప్రకాష్‌ సస్పెండ్‌ అయ్యారు. ఈ మేరకు కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తమ్మడేపల్లి గ్రామ సచివాలయ భవనం గోడపైనున్న త్రివర్ణ పతాకానికి రంగులు మార్చిన ఘటనకు సెక్రటరీని బాధ్యుడిగా చేసింది. దీంతో ప్రకాష్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఆ భవనానికి వైట్‌వాష్ వేశారు. నేడు అదే చోట త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామని కలెక్టర్ తెలిపారు.

ఎంతోమంది త్యాగాలతో స్వాత్యంత్రం వచ్చింది. వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ జాతీయ జెండా వేడుకల్ని నిర్వహించడం ఆనవాయితీ. వేడుకల సందర్భంగా జాతీయ జెండాలను ఆవిష్కరించడం, ప్రభుత్వ కార్యాలయాల్లో గోడలపై రంగులతో తీర్చిదిద్దుకుంటాం. అయితే కొన్ని పార్టీలు తమ స్వలాభం కోసం త్రివర్ణ పతాకాలను చెరిపివేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.

జాతీయ జెండా రంగులు చెరిపివేయడం దుమారం రేపింది. త్రివర్ణ పతాకం బదులు పార్టీ రంగులు ఎలా వేస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. అధికార పార్టీ స్వలాభం కోసం ఇలా చేసిందని మండిపడ్డాయి. తమ్మడేపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయం గోడపై ఉన్న జాతీయ జెండా గుర్తుల్ని తొలగించి.. వైసీపీ పార్టీ గుర్తు నీలం రంగు పెయింట్ వేయడం పెద్ద ఇష్యూ అయ్యింది. దీనిపై దేశభక్తులు, గ్రామస్తులు, నెటిజన్లు మండిపడ్డారు. జాతీయ జెండాను అవమానించడం దారుణం అన్నారు. దీనిపై రచ్చ జరగడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే చర్యలు తీసుకున్నారు. పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేశారు.