పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ సూపర్ సక్సెస్ అయ్యిందని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. అంచనా వ్యయం కన్నా 638 కోట్లు తక్కువకు టెండర్ దాఖలు చేసి మేఘా ఇంజనీరింగ్ సంస్ధ పనులను దక్కించుకుంది. దీని వల్ల ప్రభుత్వానికి 780 కోట్ల రూపాయలు ఆదా అయిందని మంత్రి తెలిపారు. పారదర్శకం విధానంతో రాష్ట్రానికి ఆదాయం పెంచాలని సీఎం జగన్ కృషిచేస్తున్నారని ఆయన వివరించారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ తో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీ అంతా బయటపడుతుందని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్చున్నారని ఆయన మండిపడ్డారు.
మేఘా ఇంజనీరింగ్ సంస్ధ 12.6 శాతం తక్కువకు పనులు చేస్తామని ముందుకు వస్తే దానిపై కూడా టీడీపీ వాళ్లు నానా యాగి చేస్తున్నారు. ఇదే మేఘా సంస్దకు మీ హయాంలో 20 వేల కోట్ల రూపాయల మేర కాంట్రాక్ట్ లు ఇచ్చిన విషయం మర్చిపోవద్దని ఆయన గుర్తు చేశారు. సంస్ధ నాణ్యతపై విమర్శలు చేస్తున్నారు. ఇంత ప్రముఖ సంస్ద నాణ్యత పాటించదని చెప్పడం సరికాదని హితవు పలికారు. పారదర్శక బిడ్డింగ్‌పై విమర్శలు సరికాదు. పోలవరం ఆగిపోయిందని, నష్టం వచ్చిందని రకరకాలుగా మాట్లాడుతున్నారు. వీటన్నింటిని జీర్ణించుకోలేక టీడీపీ నాయకులు ప్రభుత్వంపై బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తెలిపారు.
పోలవరాన్ని మీరు చెప్పిన టైంకంటే ముందే పూర్తి చేస్తే మీరు పార్టీని మూసేస్తారా అని అనిల్ కుమార్ టీడీపీకి సవాల్ విసిరారు. రివర్స్ టెండరింగ్లో నవయుగవాళ్లు కూడా బిడ్ లో పాల్గొనవచ్చుకదా, మేం వద్దనలేదే ? వాళ్లు నామినేషన్ లో అయితే ముందుకు వస్తారు. కాని బిడ్డింగ్ లో అయితే పాల్గొనరా.. అని మంత్రి వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టిస్తోంది. వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు మిగులుస్తున్నారు. పోలవరమే కాదు వెలిగొండకు కూడా రివర్స్ టెండరింగ్ కు వెళ్తాం … మీరు ఇచ్చిన ప్రతి పని గురించి రివర్స్ టెండరింగ్ కు వెళ్ళి వేల కోట్ల రూపాయలు ఆదా చేస్తామని అనిల్ కుమార్ స్పష్టం చేశారు.