తప్పుడు వార్తలు రాస్తే చర్యలు : మంత్రి పేర్నినాని సీరియస్

  • Publish Date - November 1, 2019 / 10:16 AM IST

తప్పుడు వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి, కోర్టుకు వెళ్లడానికి రెడీ అయ్యాం అన్నారు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్నినాని. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై వస్తున్న విమర్శలపై స్పందించారాయన. 2019, నవంబర్ 01వ తేదీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఓ వ్యక్తి లేదా మీడియా సంస్థ.. ప్రభుత్వంపై కట్టు కథలు రాస్తే దానికి అధిపతులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు మంత్రి. అదే ప్లేస్‌లో తెలియక రాశామని, వివరణ రాయాలని సూచించారు. ప్రభుత్వ వివరణ ఇవ్వకపోతే చట్టపరంగా యాజమాన్యంపై చర్య తీసుకోవడానికి, కోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు మంత్రి పేర్ని నాని. 

తప్పుడు వార్తలు, అబద్దాలతో కథనాలు వండివార్చటం వంటివి కొన్ని పత్రికల్లో రావటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్. నిరాధారమైన వార్తలు రాసే పత్రికలు, ఛానెల్స్, సోషల్ మీడియాపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా జీవో కూడా జారీ చేసింది.

తప్పుడు, నిరాధారమైన వార్తలపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఆయా విభాగాల (ప్రభుత్వ శాఖల) కార్యదర్శులకు అప్పగించారు. దీన్ని కొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తీసుకుంటామన్న జీవోనే కొన్ని పార్టీలు తప్పుపట్టారు. మీడియాపై ఆంక్షలు అంటూ కొన్ని పార్టీలు చెప్పటాన్ని కూడా తప్పుబడుతోంది ప్రభుత్వం. తప్పుడు వార్తలను ఆయా పార్టీలు ప్రొత్సహిస్తున్నాయా అని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు.