CAA మద్దతు కోసం సభ : తెలంగాణకు అమిత్ షా

  • Publish Date - February 17, 2020 / 08:52 AM IST

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. 2020, మార్చి 14వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారు. CAAకు మద్దతుగా నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ నాయకత్వం చేస్తోంది. LB స్టేడియంలో భారీ బహిరంగసభ జరుగనుంది. సీఏఏ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది.

ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పిలిపించాలని నేతలు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే సభకు భారీగా జనసమీకరణ చేయాలని బీజేపీ భావిస్తోంది. చట్ట విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కేంద్రం చెబుతోంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలు దీనిని వ్యతిరేకించాయి. అమలు చేయబోమని తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. సీఏఏ రద్దు చేయాలని..తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసింది. 

కేంద్ర హోం శాఖ మంత్రి హోదాలో మొదటిసారి తెలంగాణకు రానున్నారు. గతంలో బీజేపీ అధ్యక్షుడి స్థానంలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ పెద్దలు యోచిస్తున్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు చట్టాన్ని వ్యతిరేకిస్తున్న సమయంలో…అమిత్ షా ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ కొనసాగుతోంది.