ఏపీలో రాజధాని రగడ ముదురుతోంది. అమరావతిలో ఆందోళనలు జరుగుతుటే.. రాయలసీమలో కొత్త డిమాండ్‌లు తెరపైకి వస్తున్నాయి.
ఏపీలో రాజధాని రగడ ముదురుతోంది. అమరావతిలో ఆందోళనలు జరుగుతుటే.. రాయలసీమలో కొత్త డిమాండ్‌లు తెరపైకి వస్తున్నాయి. హైదరాబాద్‌లో గంగుల ప్రతాప్‌రెడ్డి నివాసంలో రాయలసీమ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మైసూరారెడ్డి, శైలజానాథ్, మరికొందరు సీమ నేతలు హాజరయ్యారు. ప్రత్యేక రాయలసీమ లేదంటే గ్రేటర్ కర్నూల్‌ను రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీమ నేతలు ప్రత్యేక వాదంతో ప్రజల్లోకి వెళ్తామంటున్నారు.
రాయలసీమలో రాజధాని రాకపై కాక మొదలైంది. రాజధాని డిమాండ్లపై ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో ఎలాంటి ఉపయోగాలు లేవంటున్నారు సీమ నేతలు. గ్రేటర్ రాయలసీమతోనే కర్నూలు జిల్లా అభివృద్ధి సాధ్యమని కొందరు.. జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని కర్ణాటకలో కలపాలని మరికొందరు కొత్త వాదనల్ని తెరపైకి తెస్తున్నారు.
కర్నూలును జ్యుడీషియల్ రాజధానిగా ప్రకటించడం వెనుక రియల్ ఎస్టేట్ దందాలే తప్ప.. ఏమాత్రం ఉపయోగం లేదని ఆరోపిస్తున్నారు. కేవలం రాజధానిని విశాఖపట్టణానికి తరలించాడానికే రాయలసీమకు హైకోర్టు ఎర వేశారని మండిపడుతున్నారు.
మరోవైపు నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని కొంతమంది సీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కర్నూలు జిల్లాను తెలంగాణలో కలపాలన్న వాదనను తెరపైకి తెస్తున్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల పేరిట రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అమరావతిలో రాజధానిని కొనసాగించకపోతే గ్రేటర్ రాయలసీమ కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇక ఏ రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉంటుందని, మూడు రాజధానులు ఎలా ఉంటాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంపీ టీజీ వెంకటేష్. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావడం లేదంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వ చర్యల వల్ల విద్యార్థులు, ప్రజల జీవితాలు అథోగతి పాలవుతున్నాయని మండిపడ్డారు.
రాష్ట్రానికి ఉంటె ఒకటే రాజధాని ఉండాలని.. లేదంటే మూడు రాజధానులతోపాటు గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని కర్నూలు జిల్లా మేధావులు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ రాయలసీమ సాధన కోసం ఎంతటి ఉద్యమాలకైనా సిద్ధమని సీమ నేతలు హెచ్చరిస్తున్నారు.