CM Jagan : పేదలకు మంచి కొనసాగాలంటే మళ్లీ మన ప్రభుత్వమే రావాలి- సీఎం జగన్
కుటుంబసభ్యులతో మాట్లాడి చర్చించి ఒక నిర్ణయానికి రండి. ఎవరి వల్ల మేలు జరిగిందనే విషయాన్ని లోతుగా ఆలోచించండి.

Cm Jagan On Chandrababu Naidu
CM Jagan : నెల్లూరు జిల్లా కావలిలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే అని జగన్ అన్నారు. మోసం, అబద్దం, కుట్ర, వెన్నుపోటు కలిపితే చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. వచ్చే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించేందుకు 5 వారాల గడువు మాత్రమే ఉందన్నారు జగన్. ఈ ఎన్నికలు చంద్రబాబు, జగన్ కు మధ్య జరుగుతున్నవి కాదని.. మోసగాళ్లకు, ప్రజలకు మంచి చేసే వారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని జగన్ అన్నారు. మే 13న జరిగే సంగ్రామంలో వైసీపీకి మద్దతివ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి మద్దతివ్వడం ద్వారా పేదలు, పిల్లలు, రైతులు బాగుపడతారని జగన్ వ్యాఖ్యానించారు.
”మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అవతలి పక్షం తోడేళ్లుగా, మోసగాళ్లుగా వస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో మన రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య జరుగుతున్నాయి. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొలేక కూటమిగా వస్తున్నారు. చంద్రబాబు, దత్త పుత్రుడు వీరికి తోడు బీజేపీని కూడా కలుపుకున్నారు. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో మన ప్రభుత్వానికి మద్దతివ్వాలి. రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వానికే మద్దతివ్వాలి.
మేనిఫెస్టో చూపించాలంటే చంద్రబాబు భయపడతారు. ఎన్నికలకు ముందు రంగు రంగుల మ్యానిఫెస్టో చూపిస్తారు. ఎన్నికల తర్వాత మ్యానిఫెస్టోను పట్టించుకోరు. మ్యానిఫెస్టోను చూపించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా? సామాజిక న్యాయానికి అర్థం నేను చెప్పాను. అక్క చెల్లెమ్మలకు, అవ్వా తాతలకు సంక్షేమం అందించాం. 14ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మేము చేసిన దాంట్లో కనీసం 10 శాతమైనా చేశారా? సచివాలయం, వాలంటీర్, రైతు భరోసా కేంద్రం .. విలేజ్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ.. ఇంగ్లీష్ మీడియం స్కూల్ .. మహిళా పోలీస్ .. అక్క చెల్లెమ్మల ఫోన్లలో దిశా యాప్.. వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ చూసినా ఉంది. అందుకే ధైర్యంగా ఇన్ని చేశాను అని చెబుతున్నా.
ప్రతి కుటుంబానికి మంచి చేశాను కాబట్టి ధైర్యంగా చెబుతున్నా. ప్రతి కుటుంబంలో మంచి జరిగి ఉంటేనే నాకు మద్దతివ్వమని కోరుతున్నా. ఈ మంచి మరో ఐదేళ్ల పాటు కొనసాగాలంటే ఓటు ద్వారా మద్దతివ్వాలి. ఈ ఓటుతో ప్రజల తలరాతలు మారుతాయి. కుటుంబసభ్యులతో మాట్లాడి చర్చించి ఒక నిర్ణయానికి రండి. ఎవరి వల్ల మేలు జరిగిందనే విషయాన్ని లోతుగా ఆలోచించండి. 2014లో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చారు. ముఖ్యమైన హామీలను చంద్రబాబు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. మోదీ, పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ఈ కరపత్రంలో వేశారు. రైతులకు రుణమాఫీ, పొదుపు సంఘాలకు రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పారు. కానీ అమలు చేయలేదు. ఇంటింటికీ ఉద్యోగం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. మరి ఇచ్చారా? ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారా?
ఇప్పుడు కూడా ఇదే కూటమి మరోసారి ఎన్నికలకు వస్తోంది. మరోసారి రంగు రంగుల పేపర్లతో మేనిఫెస్టో తెస్తున్నారు. సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అంటున్నారు.. ప్రజలు నమ్ముతారా? చంద్రబాబును నమ్మితే ప్రజలు మోసపోవడమే. ప్రజలంతా స్టార్ క్యాంపైనర్లుగా మారి పేదవాడి ఇంటికి వెళ్లి నిజాలు చెప్పి వారిని కూడా స్టార్ట్ క్యాంపైనర్లుగా మార్చాలి” అని జగన్ అన్నారు.
Also Read : రెండు పార్టీల్లోనూ డేంజర్ బెల్స్..! హాట్‌హాట్‌గా శృంగవరపు కోట పాలిటిక్స్