టార్గెట్ కుప్పం : చంద్రబాబు ఓటమికి జగన్ మాస్టర్ ప్లాన్
బాబు అంటే కుప్పం.. కుప్పం అంటే బాబు. ఆ రెండింటికీ ఉన్న లింకు తెగ్గొట్టడం అంత ఈజీనా? ఈజీనే అంటోంది వైసీపీ.. అందుకు తగ్గ వ్యూహాలను రచిస్తోంది. మేజర్‌గా ఎక్కడ దెబ్బ

బాబు అంటే కుప్పం.. కుప్పం అంటే బాబు. ఆ రెండింటికీ ఉన్న లింకు తెగ్గొట్టడం అంత ఈజీనా? ఈజీనే అంటోంది వైసీపీ.. అందుకు తగ్గ వ్యూహాలను రచిస్తోంది. మేజర్‌గా ఎక్కడ దెబ్బ
బాబు అంటే కుప్పం.. కుప్పం అంటే బాబు. ఆ రెండింటికీ ఉన్న లింకు తెగ్గొట్టడం అంత ఈజీనా? ఈజీనే అంటోంది వైసీపీ.. అందుకు తగ్గ వ్యూహాలను రచిస్తోంది. మేజర్‌గా ఎక్కడ దెబ్బ కొడితే బాబుకు దెబ్బ పడుతుందో.. ఆ మేజర్ పంచాయతీతో అసలు పంచాయితీ చేయొచ్చనేది వారి ఆలోచన. బాబు హయాంలో ప్రతిపాదనలకే పరిమితమైపోయిన అంశాన్ని ఇప్పుడు అస్త్రంగా మార్చుకుంది వైసీపీ.
బాబు చేయలేనిది జగన్ చేశారు:
ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంకు మున్సిపాలిటీ హోదా కల్పించింది వైసీపీ సర్కారు. గ్రామ పంచాయతీగా ఉన్న దానిని మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మా బాబు గారు చేసిన ప్రతిపాదననే అమలు చేశారని కుప్పం తెలుగు తమ్ముళ్లు అంటుంటే… మీ బాబు కూడా చేయలేని పని మా జగనన్న చేశాడంటూ కుప్పం వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ వైసీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశం చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
1989 నుంచి కుప్పంలో వరుసగా గెలుస్తున్న చంద్రబాబు:
కుప్పం అంటే గుర్తొచ్చేది టీడీపీ అధినేత, మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. ఈ నియోజకవర్గం ఆయనకు కంచుకోట. 1989 నుంచి మూడు దశాబ్దాలుగా చంద్రబాబు ఇక్కడే గెలుస్తూనే ఉన్నారు. చిత్తూరు జిల్లా సరిహద్దులో ఉంటూ, అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్న కుప్పం ప్రాంత అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర చెప్పుకోదగ్గది. నియోజకవర్గ పరిధిలో కుప్పం, రామకుప్పం, గుడిపల్లె, శాంతిపురం మండలాలున్నాయి. నియోజకవర్గ కేంద్రమైన కుప్పం గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా చేయాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది.
చంద్రబాబును దెబ్బ తీసేందుకు పక్కా ప్లాన్:
గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆ మేరకు స్థానిక అధికారుల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకున్నారు. అయితే ఎందుకనో ఈ ప్రతిపాదన పట్టాలెక్కలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే కుప్పంను గ్రేడ్-3 మున్సిపాలిటీగా గుర్తిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం సంచలనంగా మారింది. కుప్పం గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారడం ఇక దాదాపు లాంఛనమే. దీని వెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు జనాలు. చంద్రబాబును దెబ్బ తీయాలంటే ఇక్కడ ఏదో ఒకటి చేయాలన్నది వైసీపీ ఆలోచన. ఆయన కంచుకోటను బద్దలు కొట్టాలంటే కుప్పం ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న మున్సిపాలిటీ హోదా కల్పించడమే మార్గమని సీఎం జగన్ భావించారట. అందుకే ఆగమేఘాల మీద ఈ పని పూర్తి చేస్తున్నారనే గుసగుసలు టీడీపీతో పాటు వైసీపీ కార్యకర్తల్లోనూ వినిపిస్తున్నాయి.
కుప్పం మున్సిపాలిటీ జీవో విడుదల కావడమే తరువాయి:
మునిసిపాలిటీ కావడం కుప్పం ప్రజల చిరకాల వాంఛ. కుప్పంతో సహా పరిసరాల్లోని ఏడు పంచాయతీలను డీనోటిఫై చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కుప్పం మున్సిపాలిటీల్లో విలీనానికి ఇదివరకే ఆ ఏడు పంచాయతీలు సమ్మతి పత్రాలు కూడా పంపాయి. ఇక కుప్పం మున్సిపాలిటీ జీవో విడుదల కావడమే మిగిలిందంటున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఇది తమ నాయకుడు ఎప్పుడో చేసిన ప్రతిపాదన అని కుప్పం తెలుగు తమ్ముళ్లు వాదిస్తుండగా… మీ నాయకుడు చేయలేనిది మా నాయకుడు చేశాడని, కుప్పం వాసులకు సీఎం జగన్ ఇచ్చిన బహుమానం అంటూ వైసీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు.
కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగరేసేందుకు ప్లాన్:
కుప్పంలో కళ్లు చెదిరే రీతిలో వైసీపీ నేతలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రెండు మూడు ప్రయోజనాలు ఆశించి సీఎం జగన్ వ్యూహాత్మకంగానే కుప్పంనకు మున్సిపాలిటీ హోదా కట్టబెట్టి నట్లు భావిస్తున్నారు. ప్రతిపక్ష నేతకు పెట్టని కోటగా ఉన్న కుప్పంలోనే ఆయనకు చెక్ పెట్టడం, చంద్రబాబు మెజారిటీని మరింతగా కట్టడి చేయడం, అన్నింటికీ మించి కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేయడం లాంటి లక్ష్యాలతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారట. కుప్పం మునిసిపాలిటీని ఎలాగైనా చేజిక్కించుకునేలా కుప్పం పార్టీ శ్రేణులకు వైసిపి అధిష్ఠానం దిశానిర్దేశం చేయబోతుందని అంటున్నారు. వార్డుల విభజన పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారట. ఇప్పుడు దీనిని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తిగా మారింది.