మరో జలయజ్ఞం : సీఎం జగన్ ఆదేశాలతో ప్రణాళిక రూపోందిస్తున్న అధికారులు 

  • Publish Date - October 28, 2019 / 04:26 PM IST

సముద్రంలో వృధాగా కలిసిపోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి ప్రతి చుక్కనూ సద్వినియోగం చేసుకునే దిశగా  ఏపీ  సీఎం జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై అనేక రకాలుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో ప్రతిపాదనపై తీవ్రంగా దృష్టిపెట్టింది. పోలవరం వద్ద ఉన్న గోదావరి జలాలను బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు తరలించేందుకు సవివరమైన నివేదిక (డీపీఆర్‌) తయారుచేయిస్తోంది.  

గోదావరి ద్వారా సముద్రంలో వృథాగా కలిసిపోతున్న నీటిలో రోజుకు 23వేల క్యూసెక్కుల చొప్పున అంటే రోజుకు 2 టీఎంసీల నీటిని, మొత్తంగా 210 టీఎంసీలను వరదజలాలను తరలించాలన్నది ఆలోచన.  తద్వారా నాగార్జున సాగర్‌ కుడికాల్వ ఆయకట్టులోని 9.61 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని, నాగార్జున సాగర్‌ రెండో దశలో భాగంగా ప్రకాశం జిల్లాలోని దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో మరో 2 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించాలని భావిస్తున్నారు. అదే విధంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను ఈప్రాజెక్టు ద్వారా తీర్చాలన్నది ఆలోచన. మరోవైపు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఇటు పులిచింతల, అటు నాగార్జున మీద ఆధారపడ్డ ప్రాంతాలకు బొల్లాపల్లి బాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోన నీరు ప్రాణాధారంలా నిలుస్తుందని భావిస్తున్నారు.  

గత 15 సంవత్సరాలుగా గోదావరి నదిలో నీటి ప్రవాహాన్ని ప్రామాణికంగా తీసుకుని 105 రోజుల్లో  రోజుకు 1200 క్యూమోక్స్‌ (3.7 టీఎంసీల) ప్రవాహం ఉంటుందని వాప్‌కోస్‌ అంచనా వేసింది. ఇలా వచ్చే నీటిలో గోదావరి డెల్టా అవసరాలపోను, మిగిలిన నీరు సముద్రంలోకి పోతోంది. ఇలా సముద్రంలో కలిసిపోతున్న జలాలను కరువు, నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించడంద్వారా భారీ మేలు చేకూరుతుంది. 

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వెలిగొండతోపాటు, కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్ట్, ఎస్సార్‌బీసీ తదితర అవసరాలకోసం బనకచర్ల రెగ్యులేటర్‌ ద్వారా నీరందించే అవకాశం ఉంటుంది. ప్రాథమిక ఆలోచన ప్రకారం… పోలవరం కుడికాల్వ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి, అక్కడ నుంచి నాగార్జునసాగర్‌ కుడికాల్వకు ఎత్తిపోస్తారు. అక్కడనుంచి బొల్లాపల్లిలో ప్రతిపాదిత బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు నీటిని లిఫ్ట్ చేస్తారు. బొల్లాపల్లి నుంచి వెలిగొండ రిజర్వాయర్‌కు నీటిని అందిస్తూ, మరోవైపున  నల్లమల అడవుల్లో ఒక టన్నెల్‌ను తవ్వడం ద్వారా బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌కు తరలిస్తారు. 

ఈ మొత్తం ప్రక్రియలో 460 కిలోమీటర్ల మేర నీటిని గ్రావిటీద్వారా, మరికొన్నిచోట్ల ఎత్తిపోతల ద్వారా తరలిస్తారు. సముద్ర మట్టానికి 37 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు ఉంటే.. 260 మీటర్ల ఎత్తులో బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌ ఉంది. అంటే 230 మీటర్ల ఎత్తుకు వివిధ దశల్లో నీటిని ఎత్తిపోస్తారు.  మొత్తంగా దీనికోసం 2100 మెగావాట్ల కరెంటు అవసరం అవుతుంది. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రతిపాదిత ప్రాజెక్టు విలువ రూ.60వేల కోట్లపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

జలవనరులశాఖ సమీక్షా సమావేశంలో  సీఎం జగన్‌ దీనిపై అ«ధికారులతో చర్చించారు. సముద్రంలోకి కలుస్తున్న ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టాలన్నదే తన ఆకాంక్ష అని, ఇప్పుడు సాగునీటి వసతి ఉన్న ప్రాంతాలను స్థిరీకరించడమే కాకుండా, నిత్యం కరువుతో, తాగునీటి కొరతతో అల్లాడుతున్న ప్రాంతాలకు జలాలను తరలించి వారి కష్టాలను తీర్చాలన్నదే తన ప్రయత్నమన్నారు. డీపీఆర్‌ తయారుచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.