ఏం జరుగబోతోంది : ఆర్టీసీ జేఏసీ నిర్ణయంపై ప్రభుత్వం సమాలోచనలు

ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే అంటూ పట్టుబట్టిన ఆర్టీసీ కార్మిక సంఘాలు కొన్నాళ్ల క్రితం ఆ డిమాండ్‌పై వెనక్కి తగ్గాయి. చర్చలకు పిలవాలంటూ విజ్ఞప్తి చేశాయి. అయినా.. సర్కార్‌నుంచి స్పందన కనిపించలేదు. సమ్మె ప్రారంభించి 47 రోజులైనా… ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో… ఆర్టీసీ జేఏసీ సమ్మెపై వెనక్కి తగ్గింది. బేషరతుగా విధుల్లోకి ఆహ్వానిస్తే.. సమ్మె విరమిస్తామంటూ కండిషన్లు పెట్టింది. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది. ఇప్పుడు ఇదే ప్రశ్న అందరిలోనూ వినిపిస్తోంది. సమ్మె ప్రారంభమైన వెంటనే.. విరమించి విధుల్లో చేరాలంటూ సీఎం కేసీఆర్ కార్మికులకు సూచించారు. అయినా వాళ్లు వినకపోవడంతో… గడువు విధించారు. అప్పట్లోగా విధుల్లో చేరితేనే కార్మికులుగా పరిగణిస్తామని.. లేదంటే సెల్ఫ్ డిస్మిస్ అంటూ ప్రకటించారు. అయినా.. కార్మికులు పట్టించుకోలేదు. వ్యవహారం కోర్టుకెక్కడంతో… న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఆధారంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కార్మిక సంఘాలు సమ్మె విరమించేందుకు ముందుకొస్తున్నా… ప్రభుత్వం మాత్రం కార్మికులను విధుల్లోకి తీసుకునే పరిస్థితి లేదని పరిశీలకులంటున్నారు. ఎందుకంటే… ఆర్థికపరమైన అంశాలు తప్ప మిగతా వాటిపై చర్చిద్దామని కార్మిక సంఘాలకు సూచించినా… చర్చలు కుదరలేదు. ఆ తర్వాత.. కార్మిక సంఘాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఇక చర్చలే లేవని స్పష్టం చేసింది. అయితే.. సమ్మెపై వెనక్కి తగ్గే పరిస్థితి రావడంతో… ఆర్టీసీ జేఏసీ నిర్ణయంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. అక్టోబరు నాలుగో తేదీ అంటే.. సమ్మెకు వెళ్లే ముందు రోజు వరకు ఉన్న నిబంధనలు పాటించాలని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. బేషరతుగా కార్మికులను ఆహ్వానించాలంటున్నాయి. కానీ… ప్రభుత్వం మాత్రం… కార్మికులు విధుల్లో చేరాలంటే నిబంధనలు పాటించాల్సిందేనని.. బేషరతుగా విధుల్లో చేరాలనే ప్రతిపాదనపెట్టే అవకాశం ఉంది.
తాము పెట్టే నిబంధనలకు లోబడే ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలనే ప్రతిపాదన కూడా తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా… సమ్మె కాలానికి జీతాలు చెల్లించేది లేదని.. ఈ నిబంధనకు అంగీకరించాలని చెప్పే అవకాశం ఉంది. విధుల్లో చేరేందుకు అంగీకారపత్రం ఇచ్చిన తర్వాత… సంస్థ రూపొందించిన నియమావళికి అనుగుణంగా ఉద్యోగానికి వస్తేనే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. రెండు సార్లు విధులకు హాజరు కావాలని సూచించినా.. కార్మిక సంఘాలు పెడచెపిన పెట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఒకవేళ.. మానవత దృక్పథంతో కార్మికులను విధుల్లోకి తీసుకుంటే.. బేషరతుగా వస్తేనే తీసుకోవాలనే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరుగబోతోంది కార్మిక సంఘాలు వెనక్కి తగ్గినా.. ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకుంటుందా… లేక ప్రైవేటుకే మొగ్గు చూపుతుందా మరి కొన్ని రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు.
Read More : సానుభూతితో విధుల్లోకి తీసుకోండి : సీఎం కేసీఆర్ కు పవన్ విజ్ఞప్తి