రాజకీయాలలో సీనియర్ నేతగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్ పార్టీలో చేరే విషయమై స్పష్టత ఇచ్చారు. తాడేపల్లిలో ఫిబ్రవరి 27వ తేదీన వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో తన కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్, ఆమంచి కృష్ణమోహన్ లతో కలిసి పార్టీలో చేరబోతున్నట్లు వెల్లడించారు ఆయన. మాట తప్పని, మడమ తిప్పని నేత వైఎస్ జగన్ అని, ప్రజలపై ఆయనకు ఉన్న నిబద్ధత వల్లే వైసీపీలో చేరాలని తన కుమారుడు హితేష్ నిర్ణయించుకున్నాడని తెలిపారాయన.
రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్న హితేష్ చెంచురామ్.. తల్లిదండ్రులుగా మమ్మల్ని సలహా అడిగాడని, రాజకీయాలు అంటే చాలా బాధ్యతతో ఉండాలని హితేష్ కు చెప్పామని, దానిని హితేష్ సీరియస్‌గా తీసుకున్న తర్వాతే హితేష్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు ఆయన. ఈ సంధర్భంగా వైఎస్ జగన్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందని దగ్గుబాటి హితేశ్ చెప్పారు. ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ ఎదురలేని పోరాటం చేస్తున్నారని హితేశ్ అన్నారు.
పాదయాత్రలో ఆయన పడిన కష్టం, ప్రజలకు మేలు చేసేందుకు పడుతున్న తపన చూస్తే వైఎసీపీ అధికారంలోకి రాగానే అందరికీ మేలు జరుగుతుందనే నమ్మకం కలుగుతుందని అన్నారు. అమ్మానాన్నలు ముప్పై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, తమ కుటుంబంపై ఒక్క మచ్చ కూడా లేదని హితేశ్ అన్నారు.