Dadi Veerabhadra Rao Quits YCP
Dadi Veerabhadra Rao : మాజీమంత్రి, సీనియర్ నేత దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. సీఎం జగన్ కు తన రాజీనామా లేఖను పంపారాయన. తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు దాడి వీరభద్రరావు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి నుంచి ఒకనాడు రాజకీయాలను శాసించిన నేతగా దాడి వీరభద్రరావుకి గుర్తింపు ఉంది. ఆయన వైసీపీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. 2014లో దాడి రత్నాకర్ కు విశాఖ వెస్ట్ టికెట్ ఇస్తే ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీని వదిలేసిన దాడి కుటుంబం 2019లో మళ్లీ పార్టీలో చేరారు. చివరి క్షణంలో పార్టీలోకి రావడంతో వారికి టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.
రాబోయే ఎన్నికలపైనే దాడి ఫ్యామిలీ ఆశలు పెట్టుకుంది. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ చోడవరం లేదా యలమంచిలికి షిఫ్ట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. బలమైన సామాజికవర్గానికి చెందిన దాడి వీరభద్రరావుకి అనకాపల్లి టికెట్ ఇవ్వాల్సి ఉందని మొదటి నుంచి కూడా స్థానిక కేడర్ భావించింది. దాడి వీరభద్రరావు ఫ్యామిలీకే టికెట్ ఖాయం అని అనుకున్నారు. అయితే, అనకాపల్లి టికెట్ రేసులోకి సత్యవతి కూడా వచ్చారు. ఆమె ఎంపీగా ఉన్నారు. ఆమె కూడా అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. సత్యవతికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొచ్చనే ఊహాగానాలు ఎక్కువ కావడంతో దాడి ఫ్యామిలీకి ఈసారి టికెట్ లేదనే భావించారు.
Also Read : షర్మిల నిర్ణయంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
సామాజిక సాధికార బస్సు యాత్రకు దాడి వీరభద్రరావు ఫ్యామిలీకి ఆహ్వానం లేకపోవడం, ఆలయ కమిటీకి సంబంధించి వారి కుటుంబానికి చోటు కల్పించకపోవడంతో దాడి వీరభద్రరావు మనస్తాపం చెందారు. అప్పటి నుంచి కూడా ఆయన పార్టీ మారతారు అనే ఊహానాగాలు వినిపించాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా వైసీపీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ టికెట్ కనుక తమకు కేటాయిస్తే కచ్చితంగా గెలిచి తీరతామని దాడి ఫ్యామిలీ చెబుతోంది. అనకాపల్లి నుంచి దాడి వీరభద్రరావు లేదా ఆయన కుమారుడు రత్నాకర్ కానీ పోటీ చేసే అవకాశం ఉంది. దాడి వీరభ్రదరావు తన రాజీనామా లేఖను సీఎం జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు కూడా పంపించారు.
దాడి కుటుంబం అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశించింది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తమకే సీటు కేటాయిస్తారని ఆశించింది. అయితే వైసీపీలో ఆ పరిస్థితులు కనిపించకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక గతకొంత కాలంగా దాడి వీరభద్రరావు, మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మధ్య విభేదాలు ఉన్నాయి. అటు పార్టీలో తనకు గుర్తింపు లేదని దాడి వీరభద్రరావు ఆవేదనగా ఉన్నారు. అనకాపల్లి టికెట్ వచ్చే అవకాశం లేకపోవడం, మంత్రి అమర్నాథ్ తో విభేదాలు, పార్టీలో గుర్తింపు లేకపోవడం.. ఈ కారణాలతో వైసీపీకి రాజీనామా చేసేశారు దాడి వీరభద్రరావు.
Also Read : పవన్ ఫ్యాక్టర్ ను తగ్గించేందుకు వైసీపీ భారీ వ్యూహం.. ఆ ఇద్దరు నేతలపై ఫోకస్
వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు రేపు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. టీడీపీలో చేరే అంశంపై చంద్రబాబుతో చర్చించనున్నారు. చంద్రబాబుతో భేటీకి దాడికి అపాయింట్ మెంట్ ఖరారైంది. దాడి వీరభద్రరావు తన కుమారుడు, కార్యకర్తలతో చంద్రబాబు దగ్గరికి వెళ్లనున్నారు. 2014కు ముందు వరకు దాడి వీరభద్రరావు టీడీపీలోనే ఉన్నారు.
టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాం అని దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ తెలిపారు. వైసీపీకి రాజీనామా చేశామన్నారాయన. పార్టీల్లో ఉన్న కొన్ని ఇబ్బందుల కారణంగా రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
Also Read : జగన్ చెప్పినట్టే చేశాను.. నా తప్పంటే ఎలా?: వైసీపీ ఎమ్మెల్యే