జగన్ చెప్పినట్టే చేశాను.. నా తప్పంటే ఎలా?: వైసీపీ ఎమ్మెల్యే

డబ్బులు ఇస్తే ఐఫ్యాక్ వాళ్లు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారు. గత ఎన్నికలలో ఐఫ్యాక్ సర్వే ఆధారంగానే నాకు టికెట్ ఇచ్చారా?

జగన్ చెప్పినట్టే చేశాను.. నా తప్పంటే ఎలా?: వైసీపీ ఎమ్మెల్యే

Puthalapattu MLA MS Babu takes on YCP high command and IPAC

Updated On : January 2, 2024 / 2:09 PM IST

Puthalapattu MLA MS Babu: ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీలో టిక్కెట్ల కసరత్తు చిచ్చు రేపుతోంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురువేశారు. రాజకీయంగా వైఎస్ షర్మిల వెంట నడుస్తానని ఆయన ప్రకటించారు. విశాఖపట్నానికి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ.. వైసీపీని వీడి జనసేనలో చేరారు. తాజాగా చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా వైసీపీ అధినాయకత్వంపై మండిపడ్డారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

ఈసారి తనకు టిక్కెట్ దక్కదని తెలియడంతో పూతలపట్టులో మంగళవారం మీడియా ముందు ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ”గత అయిదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నా. ఇప్పుడు నాపై వ్యతిరేకత ఉంటే ఎవరిది బాధ్యత? సీఎం జగన్ చెప్పిందే చేశాను.. ఇప్పుడు నా తప్పంటే ఎలా? ఐప్యాక్ సర్వే ఫలితం నాకు అనుకూలంగా లేదని.. ఈ దఫా పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం ఎంతవరకు సబబు? డబ్బులు ఇస్తే ఐఫ్యాక్ వాళ్లు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారు. గత ఎన్నికలలో ఐఫ్యాక్ సర్వే ఆధారంగానే నాకు టికెట్ ఇచ్చారా? దళితులకు జగన్ ఏమీ న్యాయం చేశారు.. దళిత ఎమ్మెల్యేలంటే చిన్నచూపా?

Also Read: న్యూఇయర్‌ వేడుకల మాటున ఆ నేతల బలప్రదర్శన.. కాకినాడ జిల్లాలో కాక

ఐదేళ్లుగా ఎప్పుడైనా ఒక్కసారి అయినా మమ్మల్ని పిలిచి మాట్లాడారా? నేను చేసిన తప్పు ఏంటో జగన్ చెప్పాలి. జగన్ చెప్పకముందే నేను నియోజకవర్గంలో గడపగడపకు తిరిగాను. ఇప్పుడు నా పనితీరు బాగోలేదని, సర్వే నెగటివ్ గా ఉందని అంటున్నారు. ఓసీ సీట్లు ఒక్క చోటా మార్చకుండా కేవలం ఎస్సీ సీట్లే మారుస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఓసీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై వ్యతిరేక ఉన్నా మార్చడం లేదు. ఇప్పటికీ వైసీపీ పెద్దలపై నమ్మకం ఉంది. పార్టీని వీడే ప్రసక్తే లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గౌరవం ఉంది. ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను” అని ఎంఎస్ బాబు అన్నారు. కాగా, వైసీపీ అధిష్టానం ఆయనను ఎలా బుజ్జగిస్తుందో చూడాలి.