చిత్తూరు : శ్రీకాళహస్తి రాజకీయాల్లో కీలక పరిణామం. మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత SCV నాయుడు పార్టీకి గుడ్ బై చెప్పారు. కీలకమైన ఈ సమయంలో నాయుడు తీసుకున్న నిర్ణయంతో.. నేతలు, కార్యకర్తలు షాక్ అయ్యారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించటమే కాకుండా.. జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. పోతూపోతూ సీఎం చంద్రబాబుపై నాలుగు అభాండాలు కూడా వేశారు.
కొంతకాలంగా SCV నాయుడు అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ టికెట్ ఆశించారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అప్పట్లోనే ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చారని.. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. అప్పటి నుంచి పార్టీ పదవి లేదు టికెట్ కూడా లేదని చెప్పుకొచ్చారు. ఎప్పటికప్పుడు ఇస్తాం అంటూ మోసం చేశారని.. చివరికి టికెట్ కూడా ఇవ్వకుండా మోసం చేశారని విమర్శలు చేశారు నాయుడు. శ్రీకాళహస్తి టికెట్ బొజ్జల గోపాలకృష్ణ తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డికి కేటాయించారు.
సుధీర్ రెడ్డిని అనూహ్యంగా రంగంలోకి దించటంతో.. నాయుడు అప్పటినుంచి ఆగ్రహంతో ఉన్నారు. ముందే పార్టీ మారాలని నిర్ణయించుకున్నా.. వైసీపీ నుంచి కూడా టికెట్ కన్ఫర్మేషన్ రాకపోవటంతో సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ.. టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు ప్రకటించి కలకలం రేపారు.