70ఏళ్ల రాజకీయానికి ఫుల్‌స్టాప్‌.. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలకు గల్లా కుటుంబం దూరం

గల్లా జయదేవ్‌ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల్లా నిర్ణయంపై మరింత ఎక్కువ చర్చ జరుగుతోంది.

70ఏళ్ల రాజకీయానికి ఫుల్‌స్టాప్‌.. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలకు గల్లా కుటుంబం దూరం

Galla Family Quit Politics

Galla Family : ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం.. 70 ఏళ్ల రాజకీయాన్ని మలుపుతిప్పింది.. 70 ఏళ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ పోటీపడే ఆ కుటుంబం తొలిసారిగా రేసు నుంచి తప్పుకున్నట్లైంది. వేల కోట్ల ఆస్తులు.. వేల మంది ఉద్యోగులు.. లక్షల మంది అభిమానులు అండదండలు ఉన్నా.. వ్యాపారం కోసం… తమపై ఆధారపడిన ఉద్యోగుల కుటుంబాల కోసం గల్లా కుటుంబం రాజకీయాలను తప్పుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

70ఏళ్లలో తొలిసారిగా ఎన్నికల రణక్షేత్రం నుంచి నిష్క్రమణ..
రాజకీయాలకు ఇక సెలవు అంటూ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రకటన.. టీడీపీ కార్యకర్తలను.. గల్లా అభిమానులను నివ్వెరపరిచింది. 1955 నుంచి రాజకీయాల్లో ఉన్న జయదేవ్‌ కుటుంబం తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల సమరం నుంచి తప్పుకోవడం పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ డిబేట్‌గా మారింది. గత ఎన్నికల నుంచే జయదేవ్ తల్లి మాజీమంత్రి గల్లా అరుణకుమారి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు జయదేవ్‌ కూడా తప్పుకోవడంతో 70 ఏళ్లలో తొలిసారిగా గల్లా కుటుంబం ఎన్నికల రణక్షేత్రం నుంచి నిష్క్రమించినట్లైంది.

Also Read : రాజ్యసభ రేసులో టీడీపీ? టచ్‌లో 30మంది వైసీపీ ఎమ్మెల్యేలు?

రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన రాజగోపాల్‌నాయుడు
జయదేవ్‌ తాత పాటూరి రాజగోపాల్‌నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. 1955లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజగోపాల్‌నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించారు. ఆయన తర్వాత రాజగోపాల్‌నాయుడు కుమార్తె గల్లా అరుణ కుమారి కూడా అదే ఒరవడి కొనసాగించారు. ఆచార్య ఎన్‌జీ రంగా ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చిన రాజగోపాల్‌నాయుడు.. ముందుగా తవణంపల్లె నియోజకవర్గం నుంచి కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

చంద్రబాబుకు రాజకీయ గురువు..
ఆ తర్వాత 1962లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా శాసనసభలో అడుగుపెట్టారు. 1972లో శాసన మండలి సభ్యుడిగా పనిచేసారు. 1977లో చిత్తూరు లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1980లోనూ ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఎంపీగా నెగ్గారు. ఇటు రాజకీయాల్లోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతోనూ జిల్లాలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు రాజగోపాల్‌నాయుడు. టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజకీయ గురువుగా రాజగోపాల్‌నాయుడిని చెబుతుంటారు.

ఆ కుటుంబ రాజకీయ చరిత్రలో ఎక్కువ విజయాలే కనిపిస్తాయి
రాజగోపాలనాయుడు వారసురాలిగా వచ్చిన గల్లా అరుణకుమారి 80వ దశకం నుంచి దాదాపు నలభయ్యేళ్లు రాజకీయాల్లో కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడా కనిపించలేదు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్‌ 2014లో రాజకీయాల్లో అడుగుపెట్టి వరుసగా రెండుసార్లు గుంటూరు ఎంపీగా గెలిచి ప్రత్యేకత చాటుకున్నారు. అరుణకుమారి కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేసి జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. అమరరాజా ఫ్యాక్టరీస్‌తో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిన గల్లా కుటుంబంపై ఈ ప్రాంతంలో ఎంతో గౌరవం ఉంది. అందుకే ఆ కుటుంబ రాజకీయ చరిత్రలో ఎక్కువ విజయాలే కనిపిస్తాయి.

Also Read : వైసీపీలో మార్పుల మంటలు.. మంత్రి పెద్దిరెడ్డిపై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

రాజకీయాలు అడ్డంకి కాకూడదనే..
రెండుసార్లు ఎంపిగా గెలిచిన జయదేవ్.. చాలాకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఎంపీగా గెలిచిన తొలిసారే మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అంటూ తన వాగ్దాటిని ప్రదర్శించిన జయదేవ్‌ అనూహ్యంగా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తూ తీసుకున్న నిర్ణయం టీడీపీ వర్గాలను నివ్వెరపరిచింది. ఆయన ఆకస్మికంగా పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పడానికి గల కారణాలపై విస్తృత చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక గల్లా కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నది. వేల కోట్ల టర్నోవర్ కలిగిన తమ సంస్థకు ప్రభుత్వం నుంచి చిక్కులు ఎదురవడం గల్లా కుటుంబాన్ని బాధ పెట్టింది. తమ సంస్థ మనుగడకు, విస్తరణకు రాజకీయాలు అడ్డంకి కాకూడదనే ఆలోచనకు తీసుకువచ్చింది.

గల్లా జయదేవ్‌ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల్లా నిర్ణయంపై మరింత ఎక్కువ చర్చ జరుగుతోంది. దశాబ్దాల చరిత్ర కలిగిన రాజకీయ కుటుంబం.. విరామం ప్రకటించడంతో స్థానిక రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోననే విషయం ఆసక్తిరేపుతోంది.