మాస్ లీడర్ వంశీకీ గన్నవరంలో తప్పని పోరు.. ఆ ఇద్దరినీ ఎదుర్కోగలరా?

  • Publish Date - July 24, 2020 / 02:31 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో మరోసారి రాజకీయం వేడెక్కింది. మొన్నటి వరకూ ఎమ్మెల్యే వంశీ వర్సెస్ యార్లగడ్డ మధ్య రసవత్తర రాజకీయం సాగింది. కానీ, వంశీ వైసీపీకి అనుకూలంగా ఉంటూ టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత పరిస్థితులు కొంత చక్కబడినట్టే కనిపించాయి.

యార్లగడ్డకు జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆయన సైలెంట్ అయ్యారు. అప్పటి నుంచి గన్నవరం వైసీపీ బాధ్యతలు వంశీ చూస్తున్నారు. వంశీ అధికారికంగా వైసీపీలో చేరకపోయినా వైసీపీ ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది.

వైసీపీ రాష్ట్ర రాజకీయ సలహా మండలి సభ్యుడు దుట్టా రామచంద్రరావు, వల్లభనేని వంశీ వర్గీయుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇవి రచ్చకెక్కాయి. వంశీ, దుట్టా ఆయా కార్యక్రమాల్లో కలిసే పాల్గొన్నారు. కడప జిల్లాకు చెందిన దుట్టా అల్లుడు శివభరత్‌రెడ్డి వేరుగా నియోజకవర్గ వ్యాప్తంగా పలు చోట్ల జయంతి కార్యక్రమాలు నిర్వహించడం, గన్నవరం మండలం ముస్తాబాద్‌లో వంశీ, దుట్టా వర్గీయులు బాహాబాహీకి దగడం చర్చనీయాంశంగా మారింది.

అందుకే రంగంలోకి దిగాను :
ఎమ్మెల్యే వంశీ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీకి బహిరంగంగా మద్దతు ప్రకటించిన నాటి నుంచి దుట్టాతో సన్నిహితంగా వ్యవహరిస్తూ వచ్చారు. దుట్టా వర్గం కూడా వంశీకి మద్దతిస్తున్నట్టుగా కనిపించింది. నియోజకవర్గంలో సొంత వర్గాన్ని కూడదీసుకొనే ప్రయత్నాల్లో భాగంగా ప్రతి రోజూ వంశీ పర్యటనలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో వర్గ పోరు మొదలైంది. ఇటీవల నిర్వహించిన మీడియా సమవేశంలో నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి ఎవరంటూ అడిగితే త్వరలోనే చూస్తారుగా అంటూ దుట్టా నర్మగర్భంగా సమాధానం ఇచ్చారు. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం జరగకూడదనే తాను రంగంలోకి దిగానని దుట్టా అంటున్నారు.

టీడీపీకి సరైన నేత లేకపోవడంతో తనకు తిరుగులేదనుకున్న వంశీ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నేతలతో ఉంటున్నారు. దీంతో నియోజకవర్గంలో మరో నేత తెరపైకి వచ్చారు. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న దుట్టా రామచంద్రరావు వర్గం నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యింది. ముఖ్యంగా దుట్టా అల్లుడు భరత్ రెడ్డి నియోజకవర్గంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆయన కడప జిల్లాకు చెందిన వ్యక్తి కావడం పార్టీ కీలక నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. వంశీ నియోజకవర్గానికి రాకపోవడం భరత్‌రెడ్డి వైసీపీ తరఫున పైచేయి సాధించే దిశగా పావులు కదుపుతున్నారట.

గన్నవరాన్ని టీడీపీ కాపాడుకోలదా? :
మరోపక్క, తెలుగుదేశం పార్టీకి గన్నవరం నియోజకవర్గం కంచుకోట. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ ఏడుసార్లు జయకేతనం ఎగురవేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగినా గన్నవరం మాత్రం టీడీపీకే దక్కింది. వంశీ టీడీపీ నుంచి గెలుపొందినా, తర్వాత పరిణామాల వల్ల టీడీపీకి దూరంగా జరిగారు.

టీడీపికి ఇక్కడ ఇన్‌చార్జి కూడా లేకపోవడం పార్టీకి పెద్ద నష్టమేనని అంటున్నారు. గడచిన పది నెలలుగా పార్టీకి ఇన్‌చార్జి లేకుండానే నడుస్తోంది. దీంతో బాపులపాడు నాయకులు పార్జీకి రాజీనామా చేశారు. కంచుకోటగా ఉన్న గన్నవరాన్ని టీడీపీ ఎలా కాపాడుకుంటుందో చూడాలంటున్నారు. భరత్‌రెడ్డి దూకుడు తెలుసుకున్న వంశీ తాజాగా గన్నవరంలో గడుపుతున్నారు. దీంతో గన్నవరంలో వంశీ వర్సెస్ దుట్టాగా రాజకీయాలు నడుస్తున్నాయి. తాను రాజీనామా చేసి వైసీపీ తరఫున పోటీ చేస్తానని వంశీ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో వంశీ రాజీనామా చేస్తే వైసీపీ తరఫున తమకు టికెట్ ఇవ్వాలని దుట్టా, భరత్‌రెడ్డి కోరుతున్నట్టు చెబుతున్నారు.

ఈ విషయంపై మాట్లాడేందుకు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి దగ్గరకి వెళ్లారట. గతంలో చాలా సార్లు టికెట్ త్యాగం చేశాం కనుక ఉపఎన్నిక వస్తే తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతోందట దుట్టా కుటుంబం. ఈ నేపథ్యంలో మరి వంశీ రాజీనామా చేస్తారా? లేక ఇలానే కొనసాగుతారా? అన్నది కాలమే నిర్ణయిస్తుందని అంటున్నారు జనాలు.