Guvvala Balaraju : ఈటలను ఎవరూ కాపాడలేరు, గువ్వల బాలరాజు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఈటలపై ఎదురుదాడికి దిగారు.

Guvvala Balaraju : మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఈటలపై ఎదురుదాడికి దిగారు.

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఉంది ఈటల వ్యవహారం అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. అసైన్డ్ భూముల్లో దందా చేసుకుంటూ ఫిర్యాదుదారులపై నిందలు మోపారని మండిపడ్డారు. ఆరోపణలపై విచారణ జరిపించి నివేదిక వచ్చాకే చర్యలు తీసుకున్నట్టు వివరించారు. మీ ఆస్తుల గ్రాఫ్ ఎలా పెరిగిందో చెప్పాలన్నారు. కేసీఆర్ తన పెద్దన్న అని చెప్పిన ఈటల… ఇప్పుడు నిందలు వేయడం దారుణం అన్నారు. మతాలు, కులాల పేరుతో రాజకీయం చేసే వాళ్లని కాపాడాలని ఈటల వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలను కేంద్రం కాదు ఎవరూ కాపాడలేరని బాలరాజు అన్నారు. రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్తే మళ్లీ మేమే గెలుస్తాం అన్నారు. మతాల పేరుతో రాజకీయాలు చేసి గెలుస్తాం అనుకుంటే పొరపాటే అన్నారు.

తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుంది ఈటల వ్యవహారం అంటూ రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందన్నారాయన. నాయకులు చాలా మంది ఉండొచ్చు సారధి మాత్రం ఒక్కడే.. అదీ కేసీఆరే.. అని స్పష్టం చేవారు.

పార్టీలోకి వచ్చినప్పుడు గొప్పొడు… ఇప్పుడు దెయ్యం అయ్యారా..? అని ఈటలను ప్రశ్నించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం వస్తే ఈటలను టీఆర్ఎస్ ఆదరించిందన్నారు. ఈటల కంటే సీనియర్ అయిన హరీష్ ని పక్కన పెట్టి ఎల్పీ లీడర్ గా ఈటలను కేసీఆర్ చేశారన్నారు. కేసీఆర్ తర్వాత అన్ని పదవులు పొందింది ఈటల ఒక్కడే అన్నారు. ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల.. చట్ట వ్యతిరేక భూములు ఎలా కొన్నారో చెప్పాలన్నారు. ఫిర్యాదులు వస్తే స్పందించడం ప్రజాస్వామ్యం అని చెప్పారు. ఈటలకు ఉన్నది ఆత్మగౌరవం కాదు ఆస్తుల మీద గౌరవం అన్నారు. రైతులను హింసిస్తున్న బీజేపీలో ఈటల ఎలా చేరతారని పల్లా ప్రశ్నించారు.

ఈటల రాజేందర్ పై గులాబీ నేతల గుర్రుమంటున్నారు. ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడం.. అనంతరం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం..ఆ తర్వాత ఈటల ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలవటం, ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకంటున్న క్రమంలో.. టీఆర్ఎస్ నేతలు.. ఈటల మధ్య మాటల హీట్ పెరిగింది. ఈ క్రమంలో ఈట‌ల రాజేంద‌ర్ ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్‌ పార్టీకీ రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. తాను ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని.. తనపై వచ్చినవి కేవలం ఆరోపణలు మాత్రమే అని.. ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా రాత్రికి రాత్రే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారని ఈటల అన్నారు. నేను ఆత్మగౌరవంతో జీవిస్తున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అని ఈటల అన్నారు. నేను మీ బానిసను కాదన్నారు. నాకు ఆత్మగౌరవం ఉందన్న ఈటల దాన్ని ఎప్పుడూ వదులుకోనని చెప్పారు. ఈటల చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత‌లు ఎదురుదాడికి దిగారు.

ట్రెండింగ్ వార్తలు