అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం- ఎల్లనూరు మండలం పాతపల్లిలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని పేదలకు చెందిన 300 ఎకరాల భీడు భూమి ఉంది. ఆ భూముల్లో ఉన్న కంప చెట్లు తొలగింపు విషయంలో వైసిపి, టిడిపి నేతల మధ్య వివాదం నెలకొంది. కంప మేము తొలగిస్తామంటే, మేము తొలగిస్తామని ముందుకు వచ్చి పని మొదలెట్టడంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు.
పోలింగ్ ముగిసినప్పటి నుంచి తాడిపత్రి నియోజక వర్గంలో ఏదో ఒక కారణంతో పరిస్ధితి ఉద్రిక్తంగానే ఉంటోంది. పోలింగ్ రోజు నీలాపురంలో టీడీపీ కార్యకర్త హత్యకు గురికావటం, శనివారం రాత్రి టీడీపీ నాయకుడికి చెందిన కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టటం, సోమవారం కంప తొలగింపు విషయం .. వంటి సంఘటనలతో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది.
ఎన్నికలకు ముందే పేదల భూముల్లో పెరిగిన కంపను తొలగిస్తానని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి హామీ ఇచ్చారు. అప్పట్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆ పని చేయలేదు. కానీ… సోమవారం ఉదయం వైసీపీ నాయకుడు బోగతి నారాయణ రెడ్డి 2జేసీబీలతో కంపని తొలగించటం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర రెడ్డి 4 జేసీబీలు తీసుకుని గ్రామంలో కంపను తొలగించటం మొదలు పెట్టారు. 2 వైపుల నుంచి పోటా పోటీగా ఇరువురు నాయకులు కంపను తొలగించటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ఇరువురు నాయకులు పోటా పోటీగా కంప తొలగించే పనిలో పడటంతో , ఏం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన లో ఉన్నారు.