ఖమ్మం పార్లమెంట్ టికెట్ కోసం ఫుల్ డిమాండ్
ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. అప్లికేషన్ల స్వీకరణ కోసం గాంధీభవన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు.

Huge Demand For Khammam MP Ticket In Congress Party
Khammam MP Ticket : హైదరాబాద్ గాంధీభవన్ లో ఎంపీ అభ్యర్థుల అప్లికేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 45మంది ఆశావహులు ఎంపీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్ గిరి ఎంపీ సీటు కోసం బండ్ల గణేశ్ దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని విక్రమార్కతో పాటు సీనియర్ నేత వీహెచ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి సైతం సోనియా గాంధీ కాకుంటే తానే ఎంపీగా పోటీ చేస్తానని గతంలోనే ప్రకటించారు. అటు మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి అప్లికేషన్ సమర్పించారు. ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. అప్లికేషన్ల స్వీకరణ కోసం గాంధీభవన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు.
Also Read : కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. తొందరపడొద్దంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులు అంతా దరఖాస్తు చేసుకోవాలని చెప్పిన నేపథ్యంలో.. గాంధీభవన్ కు పెద్ద ఎత్తున నేతలు క్యూ కట్టారు. ఇప్పటివరకు దాదాపు 17 పార్లమెంట్ స్థానాలకు 45మంది దరఖాస్తు చేసుకున్నారు.
* మహబూబాబాద్ నుంచి 9 దరఖాస్తులు వచ్చాయి.
* నాగర్ కర్నూల్ నుంచి 8 దరఖాస్తులు
* వరంగల్ 6
* భువనగిరి 6
* ఖమ్మం 4
* నిజామాబాద్ నుంచి 3 దరఖాస్తులు వచ్చాయి.
ఖమ్మం పార్లమెంట్ టికెట్ కోసం ముఖ్యమైన నేతలు పోటీ పడుతున్నారు. ఒకవైపు ఖమ్మం నుంచి సోనియా గాంధీని బరిలోకి దింపాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. అటు ముఖ్యమైన నేతలకు సంబంధించిన కుటుంబసభ్యులంతా ఆ సీటు నుంచే పోటీ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని విక్రమార్క నిన్న దరఖాస్తు చేసుకున్నారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. వీ హనుమంతరావు సైతం అప్లికేషన్ ఇచ్చారు.
ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట చెప్పుకోవచ్చు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ అత్యంత సులువుగా నెగ్గే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు పెద్దఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read : ఆందోళనలో తెలంగాణ సచివాలయ ఉద్యోగులు.. ఎందుకో తెలుసా
సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం నుంచి సోనియాను పోటీ చేయిస్తే అటు ఏపీ ఇటు తెలంగాణ రెండింటిపైనా ప్రభావం ఉంటుందనే ఒక ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఇప్పటికే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీకి పంపింది. ఒకవేళ సోనియా గాంధీ పోటీ చేయకపోతే అక్కడి నుంచి పోటీ చేసేందుకు ముఖ్య నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. సోనియా గాంధీ కనుక ఖమ్మం నుంచి పోటీ చేయకపోతే ఖమ్మం సీటు నాదే అని, తానే అక్కడి నుంచి పోటీ చేస్తానని రేణుకా చౌదరి ఓపెన్ గానే ప్రకటించారు.