జనంలోకి జనసేనాని : ప్రజా సమస్యలే ముఖ్యం 

  • Publish Date - April 24, 2019 / 01:25 AM IST

ఎన్నిక‌ల త‌ర్వాత కాస్త విరామం తీసుకున్న జనసేన అధ్యక్షుడు ప‌వ‌న్ కళ్యాణ్ త్వరలోనే ప్రజ‌ల్లోకి రాబోతున్నారు. ఫ‌లితాలు ఎలా ఉన్నా నిత్యం ప్రజ‌ల్లోనే ఉండాల‌ని భావిస్తున్న ప‌వ‌న్ అందుకోసం భవిష్యత్‌ కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తున్నారు. దీంట్లో భాగంగా రాజ‌కీయ క్యాలెండ‌ర్‌ను రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా ప‌ర్యట‌న‌లు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ప‌వ‌న్.

ఎన్నిక‌ల త‌రువాత గెలుపు అంశాలు, పోలింగ్ స‌రళిపై అన్ని రాజ‌కీయ పార్టీలు అంచ‌నాలు వేసుకుంటుంటే.. జ‌న‌సేన మాత్రం అందుకు భిన్నంగా వ్యవ‌హ‌రిస్తోంది. ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములతో త‌మ‌కు ప‌నిలేద‌ని ప్రజ‌ల స‌మ‌స్యల ప‌రిష్కార‌మే మ‌ఖ్యమంటున్నారు ఆ పార్టీ అధినేత పవన్‌. ఇందుకోసం త‌మ‌కు ఓటు వేసిన వారికి కృత‌జ్ఞత‌లు చెప్పేందుకు రాష్ట్రవ్యాప్త ప‌ర్యట‌నలు నిర్వహించ‌నుంది జ‌న‌సేన‌.

ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేలోపు త‌మ‌కు ఓటు వేసిన వారికి కృత‌జ్ఞత‌లు చెప్పేందుకు జ‌న‌సేన రాజ‌కీయ క్యాలెండ‌ర్ రూపొందించింది. ఇందులో భాగంగా అన్ని నియోజ‌క‌వర్గాల్లో స‌మావేశాలు నిర్వహించి స్థానిక స‌మ‌స్యలపై అధ్యయ‌నం చెయ్యాలని ప‌వ‌న్ నేత‌ల‌కు సూచించారు. పోలింగ్ అయిపోయింది కాబ‌ట్టి ఈ స‌మావేశాల ద్వారా కౌంటింగ్‌కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఎన్నిక‌ల త‌రువాత రిలీఫ్ తీసుకుంటున్న ప‌వ‌న్ ఇటీవ‌లే అభ్యర్థులతో స‌మావేశం నిర్వహించారు. అనంత‌రం మే నెలలో జిల్లాల ప‌ర్యట‌న‌ల‌కు ప‌వ‌న్ రెడీ అవుతున్నారు. ముందుగా పార్టీ నేత‌లు, అభ్యర్థుల‌తోపాటు ప‌వన్ సైతం కృత‌జ్ఞతా స‌మావేశాల్లో పాల్గొన‌బోతున్నారు. మే మొద‌టి వారంలో పవన్‌ ప‌ర్యట‌న‌లు మొదలుకానున్నాయి. ఎప్పటిలాగానే ఈ ప‌ర్యట‌న‌ల‌ను ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించ‌నున్నారు ప‌వ‌న్. వీటితో పాటు కొన్ని స్థానిక స‌మ‌స్యలపైనా ప‌వ‌న్ స్పందించ‌నున్నట్లు పార్టీ నేత‌లు చెబుతున్నారు.

మొత్తానికి ఎన్నిక‌ల త‌రువాత ప్రజ‌ల‌తో మ‌రోసారి మ‌మేకమయ్యేందుకు జ‌న‌సేన సిద్ధమ‌వుతోంది. ఫ‌లితాల‌తో తమకు ప‌నిలేదంటూ ప్రజ‌ల స‌మ‌స్యలే ముఖ్యమంటున్న జ‌న‌సేన.. ఫ‌లితాల త‌రువాత కూడా ఇదే స్టాండ్‌పై ఉంటుందా అనేది చూడాలి..