దిశ ఉదంతం ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోందని వెల్లడించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దిశా నిందితుల ఎన్ కౌంటర్‌పై ఆయన స్పందించారు. 2019, డిసెంబర్ 06వ తేదీన ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారాయన. నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని చూసిందో తలచుకుంటే..ఆవేశం, ఆక్రోషం, ఆవేదనతో శరీరం ఉడికిపోతోందన్నారు.
జాతి యావత్తు తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం ఈ ఆవేదనే. దిశ సంఘటన ముగిసిందని దీనిని ఇంతటితో వదిలిపెట్టకూడదని, మరే ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. నిర్భయ ఉదంతం తరువాత బలమైన చట్టాన్ని పార్లమెంట్ తీసుకొచ్చిందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అయినా కూడా అత్యాచారాలు ఆగడం లేదని, ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని జరుగుతున్న సంఘటనలు చెబుతున్నాయన్ని వెల్లడించారు. ఇతర దేశాలలో ఎలాంటి చట్టాలున్నాయో..అధ్యయనం చేయాలని, మేధావులు ముందుకు కదలాలని పిలుపునిచ్చారు.
ఇలాంటి కేసులలో కోర్టుల పరంగా తక్షణ న్యాయం లభించాలని, రెండు, మూడు వారాల్లోనే శిక్షలు పడేలా నిబంధనలు రావాలన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా దిశ ఉదంతంలో సత్వర న్యాయం లభించిందని, దిశ ఆత్మకు శాంతి కలగాలని, విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పవన్ వెల్లడించారు.
Read More : దిశా నిందితుల ఎన్ కౌంటర్ : స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నలుగురు నిందితులను (ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు) చటాన్ పల్లి వద్దకు తీసుకొచ్చారు. డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు విచారిస్తుండగా నిందితులు పోలీసులపైకి దాడికి యత్నించారు. పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరపడంతో నిందితులు చనిపోయారు. దీనిని సీపీ సజ్జనార్ ధృవీకరించారు. ఘటనాస్థలాన్ని సీపీ పరిశీలించారు. ఈ వార్త నిమిషాల్లో దావానంలా వ్యాపించింది. జస్టిస్ దిశకు..జస్టిస్ జరిగిందంటూ ప్రజలు నినదించారు. టాలీవుడ్, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తున్నారు.
దిశ ఉదంతం కనువిప్పు కావాలి – బహిరంగ శిక్షలు అమలు చేయాలి- JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/UbNdnMGWNU
— JanaSena Party (@JanaSenaParty) December 6, 2019