నన్ను కొనేవాళ్లు పుట్టలేదు, పరువు నష్టం దావా వేస్తా, విజయసాయిరెడ్డికి కన్నా కౌంటర్

దక్షిణకొరియా నుంచి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై రాజకీయ రగడ కొనసాగుతోంది. బీజేపీ ఒకటంటే, వైసీపీ రెండు అంటోంది. బీజేపీ, వైసీపీ నేతల మధ్య

  • Published By: veegamteam ,Published On : April 20, 2020 / 08:30 AM IST
నన్ను కొనేవాళ్లు పుట్టలేదు, పరువు నష్టం దావా వేస్తా, విజయసాయిరెడ్డికి కన్నా కౌంటర్

దక్షిణకొరియా నుంచి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై రాజకీయ రగడ కొనసాగుతోంది. బీజేపీ ఒకటంటే, వైసీపీ రెండు అంటోంది. బీజేపీ, వైసీపీ నేతల మధ్య

దక్షిణకొరియా నుంచి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై రాజకీయ రగడ కొనసాగుతోంది. బీజేపీ ఒకటంటే, వైసీపీ రెండు అంటోంది. బీజేపీ, వైసీపీ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. మీరు సుజనాకు అమ్ముడుపోయారా? లేదా? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగా బదులిచ్చారు. నన్ను కొనేవాళ్లు పుట్టలేదని కన్నా చెప్పారు. సోమవారం(ఏప్రిల్ 20,2020) గుంటూరులో మీడియాతో మాట్లాడిన కన్నా.. అధికార పార్టీపై విరుచుకుపడ్డారు.

జగన్ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు:
కరోనా విషయంలో ప్రజల ప్రాణాలను సీఎం జగన్ పణంగా పెట్టారని.. కేవలం రాజకీయాల కోసమే పనిచేస్తున్నారని కన్నా ఆరోపించారు. కరోనా టెస్టింగ్ కిట్ల విషయంలో ఒక్కొక్కరు ఒక్కో ధర చెబుతున్నారని విమర్శించారు. ‘పర్చేజ్ ఆర్డర్ ప్రకారం ఒక్కో కిట్ ధర 730 రూపాయలు ప్లస్ జీఎస్టీ అని ఇచ్చారు. ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రూ.640 అని చెబుతారు. సాక్షి పత్రికలో మాత్రం ఏప్రిల్ 9న కిట్ ధర రూ.1200కు మెడ్ టెక్ జోన్ లో తయారు చేస్తున్నట్లు వార్త రాశారు. మన దగ్గర నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు రాశారు. టెస్టింగ్ కిట్ల కొనుగోలు విషయంలో ఇంత గందరగోళం ఎందుకు. ఛత్తీస్ గఢ్ లో మాత్రం రూ.337 ప్లస్ జీఎస్టీ చొప్పున కొరియా నుంచి కొన్నారు. దీనిపై నేను ట్వీట్ చేస్తే గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు విజయసాయిరెడ్డి స్పందించారు’ అని కన్నా ఫైర్ అయ్యారు.

నాపై విమర్శలు చేయటం ఆకాశంపై ఉమ్మి వేయటమే:
అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి నాపై విమర్శలు చేయటం ఆకాశంపై ఉమ్మి వేయటమే. ప్రభుత్వం చెప్పిన విషయాల్లో గందరగోళం గురించి ప్రశ్నిస్తే విజయసాయిరెడ్డికి ఎందుకు? ఆయనకు వచ్చే కమిషన్ పోయిందని బాధపడుతున్నారా. చంద్రబాబు నన్ను కొన్నారని తప్పుడు మాటలు మాట్లాడుతారా. నన్ను కొనే వారు పుట్టలేదు’ అని కన్నా విరుచుకుపడ్డారు.

విజయసాయిరెడ్డి పై పరువు నష్టందావా:
అధికార మదంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చారు కన్నా. ఈ విషయంలో క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. విజయసాయిరెడ్డి పై పరువు నష్టందావా వేస్తా అన్నారు. ఏపీలో ప్రభుత్వ అక్రమాలపై మాట్లాడేందుకు కేంద్రం అనుమతి అవసరం లేదని కన్నా చెప్పారు. అధికారం ఉందని కేసులు పెడతామని బెదిరిస్తారా? మీరు చెప్పిన విషయాల్లో వాస్తవం ఏమిటని అడగడం తప్పా. దక్షిణ కొరియా కంపెనీ శాఖ ఢిల్లీలో ఉండగా… నామినేషన్ పద్ధతిలో కిట్లు ఆర్డర్ ఇవ్వటం ఏంటి? అని నిలదీశారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం టెండర్ ప్రక్రియ ద్వారా కిట్లు కొనుగోలు చేసిందని కన్నా గుర్తు చేశారు.

మొత్తంగా దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా టెస్టింగ్ కిట్ల వ్యవహారం ఏపీలో రాజకీయ రగడకు దారి తీసింది. బీజేపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలులో ఎంత కమీషన్ నొక్కేశారు అని జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కన్నా చేసిన ట్వీట్ తో రగడ షురూ అయ్యింది. ఆ తర్వాత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యాయి. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.