కరీంనగర్ కలెక్టర్ పై బదిలీ వేటు

కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్న కే. శశాంకను కరీంనగర్ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సర్ఫరాజ్ అహ్మద్‌ను ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా నియమించింది.
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి అదనపు బాధ్యతలు అప్పగించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డీజీగా డాక్టర్ ఏ అశోక్‌ను నియమించింది. ఎంసీహెచ్‌ఆర్డీ అదనపు డీజీగా కొనసాగుతున్న బుసాని వెంకటేశ్వర్లును విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఇటీవల వివాదాస్పదమయ్యారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయిన ప్రస్తుత బీజేపీ ఎంపీ బండి సంజయ్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తో జరిపిన ఫోన్ సంభాషణ దాదాపు ఏడాది తర్వాత రచ్చకెక్కింది. ఆ ఎన్నికల్లో కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా కమలాకర్ పరిమితికి మించి ఖర్చు చేశారని కోర్టును ఆశ్రయించిన సంజయ్.. కలెక్టర్ సహకారం కోరినట్లుగా లీకైన ఆడియోలో ఉంది.
కలెక్టర్ స్పష్టత లేని తెలుగులో మాట్లాడగా, బండి సంజయ్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. గంగుల పరిమితికి మించి ఎన్నికల్లో ఖర్చు చేసిన అంశం, దానికి సంబంధించిన పత్రాల సమర్పణ వంటి విషయాలే చర్చకు వచ్చినట్లుగా ఉంది. టేప్‌లో 1.30 నిమిషాల సంభాషణ ఉంది. లీకైన ఆడియో పై మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కెసిఆర్ కు కూడా ఫిర్యాదు చేశారు.
మరోవైపు, ఇదే విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సర్ఫరాజ్ వివరణ కూడా ఇచ్చారు. ఆడియో టేపును ఎడిట్ చేసి లీక్ చేశారని కలెక్టర్ వివరించారు. 2019 నవంబర్ లో ఈ ఆడియో సంచలనం అవటంతో కలెక్టర్ వార్తల్లో నిలిచారు. అప్పట్లోనే సర్ఫరాజ్ పై చర్యలు తీసుకుంటారనే వార్తలు వచ్చినా అలాంటి చర్యలను ప్రభుత్వం తీసుకోలేదు. తాజాగా ఆయనపై బదిలీ వేటు పడింది.