తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) గురించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. ప్రజలను తప్పుదారి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) గురించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏలో దేశ ప్రజలకు నష్టం కలిగించే అంశం ఏముందో చెప్పాలని సీఎం కేసీఆర్ ని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం రాకుండా అడ్డుకున్న ఎంఐఎం పార్టీతో కేసీఆర్ కలిశారని, కుటిల రాజకీయాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. మజ్లిస్ తో అంటకాగుతున్న కేసీఆర్ కు హిందువుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు కిషన్ రెడ్డి.
ఒవైసి కుట్రలో కేసీఆర్ పావుగా మారారు:
తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ సైతం సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. సీఏఏ గురించి, కేంద్ర ప్రభుత్వం గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం ఇస్తోందన్నారు. కేంద్ర పథకాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లింఘిస్తోందన్నారు. సీఏఏను అపహాస్యం చేసేలా సీఎం కేసీఆర్ మాట్లాడారని సీరియస్ అయ్యారు. సీఏఏకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తామని కేసీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.
ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కుట్రలో కేసీఆర్ పావుగా మారారని లక్ష్మణ్ అన్నారు. అవకాశవాద రాజకీయ వాదులను తిప్పికొట్టాలని తెలంగాణ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై లక్ష్మణ్ స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిందని చెప్పారు.