ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ అంటూ వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఖండించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీ వివరాలు వెల్లడిస్తున్న నాని, ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా…విజయసాయిరెడ్డి విశాఖ వైసీపీ ఇన్ చార్జిగా ఉన్నారని…. అక్కడి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావాలని ఆయనకు కోరికగా ఉండి ఉంటుందని తెలిపారు. క్యాపిటల్ అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నాని చెప్పారు.
జనవరి మొదటి వారంలో ప్రభుత్వం ఏర్పాటుచేయబోయే హై పవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే క్యాపిటల్ పై సీఎం నిర్ణయం తీసుకుంటారని నాని వివరించారు. గురువారం డిసెంబర్ 26నవిశాఖలో అధికారులతో జరిగిన సమావేశంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినతర్వాత మొదటి సారిగా సీఎంజగన్ 28న విశాఖ వస్తున్నారని…ఆయనకు ఘన స్వాగతం పలకాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై విలేకరి అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా స్పందించారు.
కాగా… సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగానే జీఎన్ రావు కమిటీ నివేదిక ఉంది. నాలుగు కమిషనరేట్లు.. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న భవనాలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చెప్పింది. భవిష్యత్‌లో నిర్మించే వాటిని మెట్ట ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించింది. ఏపీలో నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని నివేదికలో పొందుపరిచింది.
గతంలో రాజధానిపై ఏర్పాటైన శివరామకృష్ణ కమిటీ రిపోర్టునూ పరిశీలించామని జీఎన్‌రావు చెప్పారు. ఏపీలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, మరికొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని వెల్లడించారు. తీర ప్రాంతంపై అభివృద్ధి ఒత్తిడి ఎక్కువుందని, అభివృద్ధిని మిగతా ప్రాంతాలకూ విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు వెనుకబడి ఉన్నాయని ప్రకటించారు. సమగ్ర అభివృద్ధి కోసం అనుసరించాల్సిన విధానాలను… ప్రభుత్వానికి సిఫార్సు చేశామని జీఎన్‌రావు కమిటీ సభ్యులు తెలిపారు.
వరద ముంపులేని రాజధాని ఉండాలని జీఎన్‌రావు కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేసింది. తుళ్లూరు ప్రాంతానికి వరద ముప్పు ఉందని తెలిపింది. పట్టణీకరణంతా మధ్య, ఉత్తర కోస్తాలోనే కేంద్రీకృతమైంది. దక్షిణకోస్తా, సీమ ప్రాంతాల్లో పట్టణీకరణ తక్కువ. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ ఏపీకి తప్పనిసరి అని సూచించామని కమిటీ తెలిపింది. ఇక కర్నూలులో హైకోర్టు, దానికి సంబంధించిన కోర్టులన్నీ రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ విషయం శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్న విషయాన్ని గుర్తు చేసింది.
శుక్రవారం డిసెంబర్ 27న జరిగిన కేబినెట్ భేటీలోనూ సీఎం జగన్ విశాఖ అభివృధ్ది గురించే చెప్పుకొచ్చారు. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేమని.. లక్ష కోట్లు పెట్టే ఆర్థిక స్థోమత ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని… లక్ష కోట్లలో పదిశాతం విశాఖలో ఖర్చుపెట్టినా ప్రపంచ స్థాయిలో రాజధానిని నిర్మించవచ్చని ఆయన మంత్రివర్గ సహచరులకు వివరించారు. సీఎం జగన్ 3 రాజధానులవిషయం ప్రకటించగానే అమరావతిప్రాంతంలో రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది.
గత10 రోజులుగా వారు నిరనస తెలుపుతూనే ఉన్నారు. దీంతో ప్రభుత్వం కూడా తొందర పడకుండా మరికొంత సమయం తీసుకోవాలనుకుని జనవరిలో హై పవర్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈలోగా జనవరి 3న బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ ఇచ్చే నివేదిక కూడా వస్తుంది కనుక అన్ని రకాలుగా ఆలోచించి.. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే హై పవర్ కమిటీ రాజధానిపై ఏర్పాటు చేసిన అన్ని నివేదికలు పరిశీలించి ప్రభుత్వానికి తుది నివేదిక ఇస్తుంది. సంక్రాంతి తర్వాత 2 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఏపీ రాజధానిపై సీఎం జగన్ ప్రకటన చేస్తారని పేర్ని నాని చెప్పారు.