అందులో నిజం లేదు, అధిష్టానం నిర్ణయమే ఫైనల్- ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
పార్టీని కాపాడుకునేందుకు ఓడిపోతామని తెలిసినా ఒకసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం పోటీలో నిలిపాము.

Komatireddy Raj Gopal Reddy : గత కొన్ని రోజులుగా నా సతీమణి లక్ష్మికి భువనగిరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని, ఆ వార్తల్లో వాస్తవం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అసలు నా సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని ఆయన తేల్చి చెప్పారు. టికెట్ కోసం కనీసం ప్రయత్నం కూడా చేయలేదన్నారు. అయినా, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఒక సామాజికవర్గానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయని, ఈ క్రమంలో బీసీ అభ్యర్థికి ఎంపీ టికెట్ ఇవ్వాలని నేను పలుమార్లు నా అభిప్రాయం చెప్పానని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
”భువనగిరి ఎంపీ టికెట్ ను నా కుటుంబసభ్యులకు ఇవ్వాలని కానీ, మరొకరికి ఇవ్వాలని కానీ నేను చెప్పలేదు. సర్వే ప్రకారం బలమైన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని మా పార్టీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీకి తెలిపాను. నా సతీమణి లక్ష్మి ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల పట్ల ఆసక్తి చూపించలేదు. నా తరపున పలు మార్లు ప్రచారం నిర్వహించారు. పార్టీని కాపాడుకునేందుకు ఓడిపోతామని తెలిసినా ఒక్కసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం పోటీలో నిలిపాము. ప్రజలు కోరుకుంటే.. సర్వేలో బలమైన అభ్యర్థి అని తేలితే.. పార్టీ అవకాశం ఇస్తే నా సతీమణి పోటీ చేస్తారు. మేము మాత్రం టికెట్ అడగలేదు. ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాము.
అహంకార కేసీఆర్ ను గద్దె దించాలనే నేను పని చేశాను. నాకు వేరే లక్ష్యం లేదు. ఆలస్యమైనా సరే నాకు భవిష్యత్ లో మంత్రివర్గంలో స్థానం ఉంటుందని నమ్ముతున్నా. నాకు అధిష్టానం ఆ మేరకు హామినిచ్చింది. పార్టీ ఆదేశిస్తే అన్ని పార్లమెంట్ స్థానాల్లో ప్రచారం కోసం తిరుగుతా. భువనగిరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము. రాష్ట్రంలో 12 నుండి 14 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది.
100 కోట్లు ఖర్చు చేసి జగదీశ్ రెడ్డి స్వల్ప మెజార్టీతో గెలిచారు. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి జగదీశ్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదం. బీఆర్ఎస్ గా మారినప్పుడే తెలంగాణతో కేసీఆర్ పార్టీకి పేగు బంధం తెగిపోయింది” అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Also Read : రేసు గుర్రాలు రెడీ..! కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?