కొడుకు కోసం త్యాగం : రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 01:58 PM IST
కొడుకు కోసం త్యాగం : రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ

ఎన్నికలు వచ్చేశాయి. కొందరు టికెట్ కోసం తాపత్రయం పడుతుంటే.. మరికొందరు తమ వారసుల రాజకీయ భవిష్యత్ కోసం ఆరాటపడుతున్నారు. రెండు టికెట్లు అడుగుతున్నారు. రాని పక్షంలో త్యాగాలకు సిద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లాలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇప్పటికే జేసీ సోదరులు.. వారసుల కోసం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఆ జాబితాలో మంత్రి పరిటాల సునీత చేరారు.

రాప్తాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సునీత.. అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను బరిలోకి దించనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆమె నిర్ణయించుకున్నారు. అభిమానులు, శ్రేయోభిలాషుల కోరిక మేరక తన కుమారుడు శ్రీరామ్‌ను ఎన్నికల బరిలో నిలబెడుతున్నట్లు సునీత కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు.

తమ కుటుంబానికి 2 సీట్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబుని అడిగామన్నారు. ఒకవేళ పార్టీ అధిష్టానం అందుకు అంగీకరించకపోతే తాను పోటీ విరమించుకుని శ్రీరామ్‌ను రాప్తాడు నుంచి పోటీ చేయిస్తానని ఆమె తెలిపారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

పరిటాల శ్రీరామ్‌….తొలుత హిందూపురం పార్లమెంట్‌ నుంచి పోటీ చేయాలని భావించారు. అక్కడ నిమ్మల కిష్టప్పను మరోసారి బరిలోకి దించడంతో….కళ్యాణదుర్గం అసెంబ్లీ సీటును ఆశించారు. ఈ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి వదులుకోవడానికి ససేమిరా అన్నారు. దీంతో పరిటాల సునీత స్వయంగా పోటీ నుంచి తప్పుకొని శ్రీరామ్‌ను బరిలోకి దించుతున్నారు. 2014 ఎన్నికల నుంచి పార్టీ వ్యవహారాల్లో పరిటాల శ్రీరామ్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మంత్రిగా సునీత ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో…కార్యకర్తలకు, నేతలకు శ్రీరామ్‌  అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలో పరిటాల రవి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లా వ్యాప్తంగా పరిటాల రవికి…అనుచరులు, అభిమానులు ఉన్నారు. 1994 ఎన్నికల్లో పెనుగొండ నుంచి పోటీ చేసిన పరిటాల రవి…ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999, 2004 ఎన్నికల్లోనూ పరిటాల రవి విజయం సాధించారు. జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పరిటాల ప్రత్యేక అభిమానం సంపాదించుకున్నారు.

2005లో పరిటాల రవి మృతితో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిటాల సునీత…భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో పరిటాల సునీత…2009, 2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్‌లో స్థానం సంపాదించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సునీత…ఈ సారి కొడుకు కోసం పోటీ నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యారు. రాప్తాడు అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్‌ బరిలో ఉంటారని త్వరలోనే….సీఎం చంద్రబాబుకు తెలియజేయనున్నారు.

మొత్తంగా అనంత రాజకీయాల్లోకి మరో వారసుడు బరిలోకి దిగుతున్నాడు. జిల్లాపై మంచి పట్టున్న కుటుంబం కావడం.. జనంలోనూ ఆదరణ ఉండడంతో.. తన కొడుకు విజయం ఖాయమన్న ధీమా సునీత ఉన్నారు. మరి, ఆమె ఆశను జనం నెరవేరుస్తారా..?పరిటాల వారసుడిని గెలిపిస్తారా..? తెలియాలంటే మే 23వరకు ఆగాల్సిందే.