గాజు గ్లాసుతో గాజువాకలో.. పవన్ గెలుపుధీమాకు కారణం అదే?

  • Published By: vamsi ,Published On : March 13, 2019 / 02:42 AM IST
గాజు గ్లాసుతో గాజువాకలో.. పవన్ గెలుపుధీమాకు కారణం అదే?

Updated On : March 13, 2019 / 2:42 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో.. టీడీపీ, వైసీపీలు వారి వారి అభ్యర్ధులను నిర్ణయించుకుని ప్రకటించేందుకు సిద్దం అవుతుండగా.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి మాత్రం ఎవరు పోటీ చేస్తారు అనే విషయమై క్లారిటీ రావట్లేదు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే సీటు విషయంలో కూడా స్పష్టత రాని పరిస్థితిలో క్యాడర్ కొంత నిరుత్సాహంలో ఉంది. ఈ క్రమంలో పవన్ అభ్యర్ధుల ఎంపికను వేగవంతం చేయగా.. మరో రెండు రోజుల్లో సీట్లను ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయమై ఆ పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం రాబోయే ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా స్క్రీనింగ్ కమిటీని కోరినట్లు చెబుతున్నారు.

గాజువాక, పిఠాపురం నియోజకవర్గాల్లో ఒక స్థానంకు ఆయన పోటీ చేసేందుకు సిద్దంగా ఉండగా.. గాజువాక నుంచే పోటీకి సిద్ధమయ్యారట పవన్ కళ్యాణ్. ఏపీలోని గాజువాకలో దాదాపు లక్ష పార్టీ సభ్యత్వాలు నమోదు కాగా.. ఇక్కడ నుండి అయితే గెలుపు ఈజీ అని పవన్ భావిస్తున్నారట.  గాజువాక నుంచి పోటీ చేస్తే ఉత్తరాంధ్రలో పార్టీ ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా జనసేనాని భావిస్తున్నారట. అయితే రాయలసీమలోని మరో నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఆలోచనలో ఉన్నాడట. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలే గాజువాకలో ప్రధానంగా పోటీ పడ్డాయి. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అప్పుడు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.