వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రైతు భరోసా పథకంపై పవన్ విమర్శలు చేశారు. సీఎం జగన్ మాట తప్పారని అన్నారు. ఎన్నికల
వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రైతు భరోసా పథకంపై పవన్ విమర్శలు చేశారు. సీఎం జగన్ మాట తప్పారని అన్నారు. ఎన్నికల వాగ్దానాన్ని పూర్తిగా నెరవేర్చలేదని విమర్శించారు. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 అందిస్తామని నవరత్నాలు, ఎన్నికల మేనిఫెస్టోలో ఘనంగా ప్రకటించిన జగన్.. కేంద్రం ఇస్తున్న రూ.6వేలు కలిపి రూ.13,500 ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని పవన్ ప్రశ్నించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి ఇస్తామని ఎందుకు చెప్పలేదని నిలదీశారు.
రైతులకు జగన్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇవ్వాల్సిన మొత్తం రూ.12,500. దీనికి కేంద్ర సాయం రూ.6వేలు కలిపితే రూ.18,500 అవుతుంది. కాబట్టి.. అంతే మొత్తాన్ని రైతులకు ఇవ్వాలని జగన్ ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు. ఒక వేళ అంత మొత్తం ఇవ్వలేకపోతే అందుకు కారణాలను రైతులకు చెప్పాలన్నారు. వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు క్షమపణాలు అడగాలన్నారు.
సీఎం జగన్ మంగళవారం నెల్లూరు జిల్లా కాకుటూరులో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కౌలు రైతులకు రైతు భరోసా పథకం కార్డులు ఇవ్వడంతో పాటు చెక్కులు అందజేశారు. ఈ పథకానికి రూ.5వేల 510 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీలో 50లక్షల మంది రైతులకు ఈ పథకం కింద ప్రయోజనం చేకూరనుంది. 3 లక్షల మంది కౌలు రైతులకు మేలు జరగనుంది.
రైతు భరోసా పథకం కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రూ.12వేల 500 నుంచి రూ.13వేల 500కు పెంచింది. ఐదేళ్ల పాటు పథకాన్ని వర్తింపజేయనుంది. ఏటా రూ.13వేల 500ను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తారు. 3 విడతల్లో రైతు భరోసా డబ్బును పంపిణీ చేస్తారు. ప్రతీ ఏటా మేలో రూ.7వేల 500, రబీలో రూ.4 వేలు, సంక్రాంతికి రూ.2 వేలు ఇస్తామని చెప్పారు.