ప్రకాశం రాజకీయం : పర్చూరు సీటుపై వారసుల కన్ను
జిల్లా రాజకీయాల్లో ఆ రెండు కుటుంబాలది ప్రత్యేక గుర్తింపు. భార్యాభర్తలిద్దరూ రాజకీయ ఉద్దండులే. ఒకప్పుడు భర్త రాష్ట్ర రాజకీయాలను శాసిస్తే..

జిల్లా రాజకీయాల్లో ఆ రెండు కుటుంబాలది ప్రత్యేక గుర్తింపు. భార్యాభర్తలిద్దరూ రాజకీయ ఉద్దండులే. ఒకప్పుడు భర్త రాష్ట్ర రాజకీయాలను శాసిస్తే..
ప్రకాశం : జిల్లా రాజకీయాల్లో ఆ రెండు కుటుంబాలది ప్రత్యేక గుర్తింపు. భార్యాభర్తలిద్దరూ రాజకీయ ఉద్దండులే. ఒకప్పుడు భర్త రాష్ట్ర రాజకీయాలను శాసిస్తే.. ఆ తర్వాత భార్య కేంద్ర మంత్రిగా పని చేశారు. మరో కుటుంబానికి చెందిన నేత మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. రెండు కుటుంబాలు తమ వారసులను.. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఆ నియోజకవర్గం ఏంటీ ? ఎందుకంత అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది ?
జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు.. గెలుపు గుర్రాలపై దృష్టి సారించాయి. కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారైతే.. మరి కొన్ని నియోజకవర్గాల్లో పోటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. పర్చూరు నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన ఏలూరు సాంబశివరావు…వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆ తర్వాత ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రతి గ్రామంలో నేరుగా సంత్సంబంధాలు కలిగి ఉన్నారు. సాంబశివరావుకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉండటంతో….వచ్చే ఎన్నికల్లో టికెట్‌ను ఆయనకే కన్ఫాం చేశారు.
2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన గొట్టిపాటి భరత్.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. దీంతో ఏలూరు సాంబశివరావును తట్టుకొని నిలబడే వ్యక్తి కోసం.. వైసీపీ నేతలు ఆన్వేషిస్తున్నారు. గొట్టిపాటి స్థానంలో రావి రామానందంను నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించారు జగన్. అయితే సాంబశివరావుకు రామానందం పోటీ ఇస్తాడా అన్న అనుమానం వైసీపీలో రేకెత్తిస్తోంది. సాంబశివరావుకు ఉన్న మాస్ ఫోలోయింగ్ ముందు… రామానందం నిలవడని ఆంచనాకు వచ్చింది వైసీపీ.
జిల్లాలో అన్ని సీట్లలో క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో… ఆపరేషన్ విజయ్‌ని ఇప్పటికే ప్రారంభించింది వైసీపీ. ఓ మాజీ మంత్రితో పాటు మరో మాజీ ఎమ్మెల్యేను పార్టీలోకి చేర్చుకుంది. ఇద్దర్ని ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా ప్రకటించారు విజయసాయి రెడ్డి. అదే బాటలో పర్చూరు అసెంబ్లీ నుంచి బడా ఫ్యామిలీని దించి…ఏలూరుకు చెక్ పెట్టాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. దగ్గుబాటి నుంచి లేదా కరణం వారసుడ్ని దించాలని వైసీపీ ఎత్తులు వేస్తోంది. ఇలాంటి ప్రచారం జరుగుతుండగానే… గ్రామంలోని తమ ఇంటిని క్లీన్ చేయించారు దగ్గుబాటి. అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. దీంతో దగ్గుబాటి వారసుడు హితేశ్ ఆరంగేట్రం తథ్యమని…అది కూడా వైసీపీ నుంచి ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు తన కుమారుడ్ని ఎమ్మెల్యేగా చేయాలని కరణం బలరాం వ్యూహాలు రచిస్తున్నారు. తన కుమారుడికి అద్దంకి టికెట్ కేటాయించాలని చంద్రబాబు కోరారు. అయితే అందుకు చంద్రబాబు…అద్దంకి వైపు వెళ్లవద్దని కరాఖండిగా చెప్పేశారు. దీంతో ప్లాన్ మార్చేశారు కరణం బలరాం. పర్చూరు టికెట్ తమకు కేటాయిస్తే….పార్టీ మారిపోతామని రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. కరణం లేదా దగ్గుబాటి కుటుంబాలను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించాలని వైసీపీ నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు.
దగ్గుబాటి కుటుంబం పార్టీ మారి…పర్చూరు నుంచి తమ వారసుడు హితేష్ చెంచురామ్‌ను బరిలోకి దించితే ఎన్నిక రసవత్తరంగా మారనుంది. అంతేకాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారనుంది. అయితే వైసీపీ ప్రపోజల్‌ను దగ్గుబాటి కుటుంబం అంగీకరిస్తుందా ? లేదా ? తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.