తెలంగాణ టీడీపీని కాపాడుకుని, నిలబెట్టేందుకు ఓ వైపు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే.. ఇక్కడి నేతలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేందుకు చూస్తున్నారట. ఒక్కప్పుడు తెలంగాణలో పార్టీ ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు పార్టీ ఉనికే లేకుండా పోయో పరిస్థితిలో ఉంది.
మరోపక్క ఏపీలో అధికారం కోల్పోయి దిక్కుతోచకుండా ఉన్న పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు కిందా మీదా పడుతున్నారు. టీటీడీపీలో నూతనోత్సాహం తీసుకొచ్చేందుకు ప్రతి శనివారం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చి నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ పార్టీలో మాత్రం కొందరు నేతలు పార్టీని మరింత దిగజార్చేలా చేస్తున్నారని అంటున్నారు.
పదవులు అమ్మకానికి :
ఇటీవలే టీ-టీడీపీలో కొత్తగా పది లోక్‌సభ నియోజకవర్గాలకు బాధ్యులను నియమించారు. వీరి ద్వారా జిల్లాలలో పార్టీ పరిస్థితిపై రిపోర్ట్ తెప్పించుకుని, పార్టీ కోసం పని చేస్తున్న వారికి పెద్ద పీట వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వారంతా రెండు నెలలుగా ప్రతి విషయంపై నాయకులతో చర్చిస్తున్నారు.
నిజానికి పార్లమెంటరీ బాధ్యుల నియామకాన్ని తొలుత రాష్ట్ర నాయకత్వంలోని కొంతమంది పరిశీలకులకు అప్పగించారు. అన్ని పార్లమెంటరీ కమిటీల నియామకాలపై నేతలు అంగీకారాన్ని తెలిపారు. కానీ గ్రేటర్ వరంగల్ పార్లమెంటరీ బాధ్యుల నియామకంలో పార్టీ పరిశీలకులు ఒక్కరు పార్లమెంటరీ పదవి అమ్మకానికి పెట్టారని అంటున్నారు.
నేతలపై కార్యకర్తల ఆగ్రహం :
వరంగల్ జిల్లాలో పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడిగా పని చేస్తున్న వారికి సరైన అవకాశాలు కల్పించడం లేదని నేరుగా ఎన్టీఆర్ భవన్‌లో దీక్షకు దిగారు. తెలంగాణలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పార్టీని కాపాడుకునేందుకు పార్టీ అధ్యక్షుడు తాపత్రయ పడుతూ ఉంటే కొందరు టీడీపీ నేతలు పార్టీ పదవులను కూడా అమ్మేసుకుంటున్నారట.
కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉండి, ముందుకు నడిపించాల్సిన ముఖ్య నేతలు కొందరు ఇలా చేయడంపై పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇలానే కొనసాగితే ఇక పార్టీ పూర్తిగా కనుమరుగైపోవడం ఖాయమని గుసగుసలాడుతున్నారు. ఈ విషయంలో అధినేత చంద్రబాబు కలుగజేసుకోవలసిందేనని అంటున్నారు.