టీడీపీకా? జనసేనకా? చంద్రబాబుకి తలనొప్పిగా మారిన విజయవాడ వెస్ట్‌ సెగ్మెంట్

పార్టీ బలంగా ఉన్న విజయవాడ వెస్ట్‌ను వదులుకోవద్దని టీడీపీ నేతలు ఓవైపు.. బెజవాడ పార్లమెంట్ పరిధిలో ఒక సీటు కచ్చితంగా బీసీలకు కేటాయించాలని బుద్ధా వెంకన్న మరోవైపు డిమాండ్‌ చేయడంతో అధిష్టానానికి చిక్కులు వచ్చి పడ్డాయి.

Vijayawada West MLA Ticket

Vijayawada West : విజయవాడ వెస్ట్‌ సెగ్మెంట్‌ టికెట్‌ వ్యవహారం రసవత్తరంగా మారింది. ఈ నియోజకవర్గం సీటు కోసం టీడీపీ నుంచి నలుగురు పోటీ పడుతుంటే.. జనసేన కూడా ఆ స్థానం మాకే కావాలంటూ పట్టుబడుతోంది. ఇక్కడ విభేదాలకు కేంద్ర బిందువుగా ఉన్న కేశినేని నాని పార్టీ వీడినా.. టీడీపీ నేతల మధ్య.. సయోధ్య మాత్రం కుదరలేదు. తాజాగా జనసేన కూడా టికెట్‌ రేసులోకి రావడంతో రాజకీయం కొత్త మలుపు తిరిగింది.

టికెట్ కోసం తమ్ముళ్ల పోటీ..
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు రోజురోజుకు ముదిరి పాకాన పడుతున్నాయి. ఎంపీ కేశినేని నాని తెలుగుదేశాన్ని వీడి.. వైసీపీలో చేరినా నేతల మధ్య విభేదాలు మాత్రం సమసిపోలేదు. ఈ సెగ్మెంట్‌లో బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరా, జలీల్ ఖాన్, ఎంఎస్ బేగ్ టికెట్ రేసులో ఉన్నారు. వీరంతా ఎవరికి వారే టికెట్‌ తమకే కావాలంటూ లాబీయింగ్‌ మొదలు పెట్టారు.

లోకేశ్ పై ఒత్తిడి తెస్తున్న బుద్ధా వెంకన్న..
వెస్ట్‌ సీటు తనకే ఇవ్వాలంటూ బుద్ధా వెంకన్న పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్‌పై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నానని చెప్పడంతో పాటు.. బీసీ కార్డును తెరపైకి తీసుకువస్తున్నారాయన. ఇదే సమయంలో తనకు నాగుల్‌మీరా మద్దతు కూడా ఉందని చెబుతున్నారు. మరోవైపు నాగుల్‌మీరా సైతం లోకేశ్‌ను కలిసి తమ ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్‌ ఇవ్వాల్సిందేనని కోరారు. అంతేకాదు.. ఒకరికి ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే.. మరొకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు నాగుల్‌మీరా.

Also Read : పొత్తుపై స్వరం మార్చిన పవన్.. తాను చెప్పాల్సింది క్లారిటీగా చెప్పేశారా!

టికెట్ ఆశిస్తున్న కేశినేని నాని అనురుడు..
మరోవైపు మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కూడా బల ప్రదర్శన నిర్వహించి మరీ.. మైనార్టీ కోటాలో సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చివరిసారి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారాయన. ఇక కేశినేని నాని అనుచరుడిగా ముద్రపడిన MS బేగ్‌ సైతం యూత్‌ కోటాలో తనకు అవకాశం కల్పించాలని టీడీపీ అధిష్టానాన్ని కోరుతున్నారు.

వెస్ట్ టికెట్ తనకే అన్న ధీమాలో జనసేన నేత..
ఓవైపు టీడీపీ నేతలంతా టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్‌ జనసేనకే దక్కుతుందని ఆశిస్తున్నారు ఆ పార్టీ నేతలు. 2019లో జనసేన నుంచి పోటీచేసిన పోతిన వెంకటమహేశ్‌.. ఐదేళ్లుగా ఈ నియోజకవర్గంలో క్యాడర్‌ను పెంచుకుంటున్నారు. పవన్‌ అండతో ఈసారి టికెట్‌ కచ్చితంగా తనకే దక్కుతుందన్న ధీమాలో ఉన్న మహేశ్‌… ప్రచారం సైతం ప్రారంభించారు.

మైనార్టీలకే ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి..
అధికార వైసీపీ ఆసిఫ్‌ అనే మైనార్టీకి విజయవాడ వెస్ట్‌ సీటు కేటాయించిన క్రమంలో.. టీడీపీలో కూడా మైనార్టీలకే ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్‌ మినహా.. మరో నియోజకవర్గం జనసేనకు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే ఒకసారి చంద్రబాబుతో చర్చలు జరిపారు.

Also Read : అందుకు సాక్ష్యం మా అమ్మే.. మీకు దమ్ముంటే మా అమ్మను అడగండి.. వైసీపీ నేతలపై షర్మిల ఫైర్

పార్టీ బలంగా ఉన్న విజయవాడ వెస్ట్‌ను వదులుకోవద్దని టీడీపీ నేతలు ఓవైపు.. బెజవాడ పార్లమెంట్ పరిధిలో ఒక సీటు కచ్చితంగా బీసీలకు కేటాయించాలని బుద్ధా వెంకన్న మరోవైపు డిమాండ్‌ చేయడంతో అధిష్టానానికి చిక్కులు వచ్చి పడ్డాయి. మొత్తంగా పొత్తులో భాగంగా ఈ స్థానం ఎవరికి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

 

ట్రెండింగ్ వార్తలు