Pawan Kalyan : పొత్తుపై స్వరం మార్చిన పవన్.. తాను చెప్పాల్సింది క్లారిటీగా చెప్పేశారా!

పొత్తులో ఉన్న టీడీపీని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పోటీచేసే రెండు నియోజకవర్గాల పేర్లను ప్రకటించడంతోపాటు.. ఆ నియోజకవర్గాల్లో రేసులోఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించేశారు.

Pawan Kalyan : పొత్తుపై స్వరం మార్చిన పవన్.. తాను చెప్పాల్సింది క్లారిటీగా చెప్పేశారా!

Pawan Kalyan

TDP-Jana Sena alliance : పొత్తులో ఉన్న టీడీపీని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పోటీచేసే రెండు నియోజకవర్గాల పేర్లను ప్రకటించడంతోపాటు.. ఆ నియోజకవర్గాల్లో రేసులోఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించేశారు. దీంతో పవన్ తాజా నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత మాట్లాడిన తీరు గమనిస్తే.. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి మాట్లాడుతూ తాను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

Also Read : Pawan Kalyan : జనసేన పోటీచేసే రెండు స్థానాలను ప్రకటించిన పవన్ కల్యాణ్.. టీడీపీ పొత్తుధర్మం తప్పిందంటూ వ్యాఖ్య

తనను తక్కువగా తీసుకుని, ఏవో కొన్ని సీట్లు ఇచ్చేస్తే సరిపోతుందని అనుకోవద్దని, తనకు రావాల్సిన గౌరవకరమైన వాటా రావాల్సిందేనని నర్మగర్భంగా తెలుగుదేశం పార్టీకి పవన్ కల్యాణ్ తెలియ చెప్పారు. జనసేనను తేలిగ్గా తీసుకోవద్దని, వన్‌వే ట్రాఫిక్‌లా పొత్తు ఉండదని పవన్‌ చెప్పకనే చెప్పారు. పొత్తుతోనే జనసేన – టీడీపీ ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నామని, ఇందులో కొన్ని ఆటుపోట్లు ఉంటాయని చెబుతూనే.. స్థానిక సంస్థల నుంచి మొదలుపెట్టి.. అన్ని స్థాయిల్లోనూ భవిష్యత్తులో జనసేన మూడోవంతు సీట్లు తీసుకుంటుందని పార్టీ క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. ఎన్నిసీట్లు తీసుకోవాలో తనకు తెలుసని అన్నారు. ఆటుపోట్లు ఉన్నా.. తెలుగుదేశంతో కలిసే వెళ్తున్నామని పవన్ చెప్పారు. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రెండు అసెంబ్లీ సీట్లను ప్రకటించినట్టుగానే.. ప్రత్యేక పరిస్థితుల్లో తాను కూడా రిపబ్లిక్ డే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు, రాజానగరం అసెంబ్లీ సీట్లకు జనసేన పోటీచేస్తుందని ప్రకటిస్తున్నట్టు పవన్ చెప్పారు. అంటే.. తెలుగుదేశం వ్యవహరించే తీరుగానే, తాము వ్యవహరించాల్సి ఉంటుందని, అందుకే పొత్తు ధర్మం ప్రకారం సంయమనం పాటించాలని తెలుగుదేశానికి పరోక్షంగా పవన్ సూచించారు. కేవలం వారు ఇచ్చే వారు.. తాము తీసుకునేవారంలాగా భావించవద్దని పవన్ తన తాజా వ్యాఖ్యలద్వారా హితబోధ చేశారు.

Also Read : YS Sharmila : అందుకు సాక్ష్యం మా అమ్మే.. మీకు దమ్ముంటే మా అమ్మను అడగండి.. వైసీపీ నేతలపై షర్మిల ఫైర్

తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు దాదాపు 18శాతం ఓట్లు వస్తే.. ఈసారి అక్కడ ఓట్ల శాతం దాదాపు 10 శాతం పెరిగిందని భావిస్తున్నారు. అక్కడ తెలుగు దేశం పార్టీ తమ అభ్యర్థిని ఏకపక్షంగా ప్రకటించడంతో, జనసేన కార్యకర్తలు బాధపడ్డారని పవన్ చెప్పారు. ఇది సరైన విధానమని తాను చెప్పడం లేదని అంటూ.. పొత్తు ధర్మం ప్రకారం అలా ప్రకటించకూడదని జనసేన అధినేత చెప్పారు. మా నాన్న ముఖ్యమంత్రి కానున్నారని లోకేశ్ ఇటీవల ప్రకటించినప్పటికీ, పెద్ద మనసుతో, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. తనకు విహంగవీక్షణం ఉంటుందని, వచ్చే ఐదేళ్లలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఎలా చేయాలో తనకు తెలుసునని పవన్ భరోసా ఇచ్చారు.

మొత్తం మీద చూస్తే.. జనసేన కార్యకర్తల సమక్షంలో తెలుగుదేశం పార్టీకి తాను చెప్పదలచుకున్నది పవన్ చెప్పేశారు. అవేంటంటే.. పొత్తు ఉంటుంది.. అదే సమయంలో ఒత్తిళ్లూ ఉంటాయి. పొత్తు ధర్మం ప్రకారం ఇరుపక్షాలు సంయమనం పాటించాలి. అలాగే ఎవరంతట వారు సీట్లు ప్రకటించుకుంటూ వెళ్లకూడదు. సీట్లలో, అధికారంలో జనసేన తనవంతు వాటా తీసుకుంటుంది. జగన్‌ను దించడమే ఇప్పుడున్న ఏకైక లక్ష్యం. అధికారంలోకి వచ్చాక, వచ్చే ఐదేళ్లలో జనసేన గౌరవకరరీతిలో, తనదైన రీతిలో తన వంతు పాత్ర పోషిస్తుంది.