తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్దులకు శుభవార్త వినిపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఉన్న వయో పరిమితిని సడలించారు. 57 ఏళ్లు నిండిన వృద్దులకు వృద్ధాప్య ఫించన్ అందించబోతుందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ నిర్ణయం వల్ల ఆసరా ఫించన్ లబ్దిదారుల సంఖ్య 39 లక్షల 31 వేల 976 నుంచి మరింత పెరుగనుందన్నారు. గత బడ్జెట్‌లో ఆసర పెన్షన్ల కోసం రూ. 9 వేల 402 కోట్లు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ బడ్జెట్‌లో రూ. 11 వేల 758 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
రూ. 40 వేల కోట్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందని, అసహయలైన పేదలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం ఆసరా పెన్షన్లను అందిస్తుందని తెలిపారు. వృద్దులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాల బాధికులు, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు, నేత కార్మికులు, నేత, గీత కార్మికులు అందించే పెన్షన్ రూ. 1000 నుంచి రూ. 2, 016కు పెంచిందన్నారు. వికలాంగులకు ఇచ్చే పెన్షన్ రూ. 1,500 నుంచి రూ. 3, 016కు పెంచిందన్నారు.
ఎస్సీలు, ఎస్టీలు అత్యంత పేదరికం అనుభవిస్తున్నారని, వారి జనాభాకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులు వారికి ఖర్చయ్యే విధంగా చట్టంలో కఠిన నిబంధనలు పెట్టామని, దీనికి సంబంధించి నిధుల వివరాలను పెన్ డ్రైవ్..ద్వారా సభ్యులకు అందచేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గాల వారీగా వాటిని పరిశీలించుకోవాలని సూచించారు. అత్యంత పారదర్శకంగా ఖర్చు చేస్తోందన్నారు మంత్రి హరీష్ రావు.
Read More : తెలంగాణ బడ్జెట్..రైతులకు గుడ్ న్యూస్ : రూ. 25 వేలలోపు ఉన్న రుణాలు మాఫీ