ఆర్టీసీపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏంటి? గురువారం జరిగే కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయం తప్పదా?.. ముఖ్యమంత్రి ఆర్టీసీ ఆస్తుల లెక్కలు తీయడంలో ఆంతర్యమేంటి? ఆర్టీసీని మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారా? లేదంటే జోన్లుగా విభజించబోతున్నారా? ప్రైవేట్ పర్మిట్లకు తలుపులు బార్లా తెరుస్తారా?… ఇంతకీ ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏమిటి? తెలంగాణలో ఆర్టీసీ భవిష్యత్ ఏంటన్నది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. సమ్మె విరమించి విధుల్లో చేరుతామని కార్మికులు డిపోలకు క్యూ కడుతున్న నేపథ్యంలో… ఆర్టీసీపై చర్చించేందుకు గురువారం, నవంబర్ 28న, రాష్ట్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం అవుతుండటం ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని కార్మికులతో పాటు సామాన్య జనం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఆర్టీసీలో సంస్కరణలే లక్ష్యంగా నవంబర్ 28,గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్టీసీ అంశంపైనే సుదీర్ఘంగా చర్చించనున్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు… ఆర్టీసీని పూర్తిగా మూసివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఆర్టీసీ సమ్మె మొదలైన రోజునుంచే… ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంపైనే ఫోకస్ చేసిన సర్కార్… ప్రైవేటీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో 50శాతం రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని నిర్ణయించింది. అయితే కోర్టు వివాదాల నేపథ్యంలో ఆ నిర్ణయం ఇంకా అమల్లోకి రాలేదు. అయితే.. మంత్రిమండలి సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆర్టీసీలో భారీ సంస్కరణలు తేవాలని భావిస్తున్న ప్రభుత్వం… సంస్థ ఆస్తుల్ని లెక్కగడుతోంది. ప్రభుత్వ విలువ, మార్కెట్ రేట్లను వేర్వేరుగా అంచనా వేస్తూ నివేదికలను సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే ఉద్యోగులకు సంబంధించి కూడా పూర్తి నివేదికలను సిద్ధం చేయాలన్నారు. భవిష్యత్‌లో 50 శాతం ప్రైవేటు బస్సులొస్తే… 20వేల నుంచి 22 వేలమంది కార్మికులు మాత్రమే అవసరమవుతారని… మిగిలిన వారిని ఎలా సర్దుబాటు చేయాలన్న అంశంపై ప్రభుత్వం పలురకాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొంతమందికి వీఆర్‌ఎస్ అవకాశం కల్పించి… మరికొంతమందికి కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్‌ను అమలు చేయాలనుకుంటోంది.
మరోవైపు ఆర్టీసీ నిర్వహణలో కూడా ప్రైవేటు ఆపరేటర్లతో పోటీపడేలా ఆధునీకరించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంస్థను అభివృద్ధి చేసేందుకు నిధుల సమీకరణపై ఫోకస్ చేసింది. ఆర్టీసీ ఆస్తుల్ని విక్రయిస్తే ఎన్ని నిధులు సమకూరుతాయన్న అంచనాలు తయారుచేస్తోంది. ఆర్టీసీ ఆస్తుల ద్వారా ప్రస్తుతం వస్తున్న ఆదాయం వ్యయాలతో పాటు భవిష్యత్ ఆదాయంపైనా సమగ్ర నివేదికల్ని అధికారులు తయారు చేస్తున్నారు. మొత్తానికి మంత్రివర్గ భేటీలో ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది. అయితే ఆర్టీసీ విభజన పూర్తిస్థాయిలో పరిష్కారం కాకపోవడంతో… న్యాయపరమైన చిక్కులొస్తాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కేబినెట్ భేటీ తర్వాత దీనిపైనా క్లారిటీ వచ్చే అవకాశముంది.