వైసీపీ అభ్యర్ధులుగా బరిలో నిలిచేదెవరో : ప్రకాశం జిల్లా నేతల్లో టెన్షన్ 

ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్ధులుగా బరిలో నిలిచేదెవరో ఆ పార్టీ అధిష్టానం ఎటు తేల్చకపోవడంతో.. నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నాయకులు ఇప్పుడు తెగ టెన్షన్ పడిపోతున్నారు.

  • Publish Date - March 16, 2019 / 04:00 PM IST

ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్ధులుగా బరిలో నిలిచేదెవరో ఆ పార్టీ అధిష్టానం ఎటు తేల్చకపోవడంతో.. నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నాయకులు ఇప్పుడు తెగ టెన్షన్ పడిపోతున్నారు.

ప్రకాశం : వైసీపీకి కంచుకోటైన ఆ జిల్లాలో .. బలమైన అభ్యర్ధులనే బరిలో దించేందుకు .. ఆ పార్టీ అధిష్టానం రాజకీయాలు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ప్రచారంలో వారు దూసుకుపోతున్నా .. అధినాయకుడు మాత్రం టికెట్ ఎవరికనేది తెల్చకపొవడంతో .. అభ్యర్ధుల్లో టెన్షన్ మొదలైంది. అధికార పార్టీ ఇప్పటికే ఎన్నికల యుద్ధబరిలో నిలిచే సైన్యాన్ని ప్రకటించగా..  ప్రతిపక్షపార్టీ మాత్రం ఇంకా వేచి చూసే ధోరణిలో ఉండటంతో .. ఇటు టికెట్ పై ధీమాగా ఉన్నవారితో పాటు, ఇంతకాలం పార్టీ జెండామోస్తున్న అసంతృప్తవర్గం సైతం జగన్ ప్రకటనకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్ధులుగా బరిలో నిలిచేదెవరో ఆ పార్టీ అధిష్టానం ఎటు తేల్చకపోవడంతో.. నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నాయకులు ఇప్పుడు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా.. పార్టీ టికెట్ ఎవరికిస్తారోననే అనుమానాలు ఇటు కొత్తగా చేరిన నాయకులతో పాటు .. అటు ఎప్పటినుండో పార్టీ జెండా మోస్తున్న నియోజకవర్గ సమన్వయకర్తలు సైతం ఎదురుచూస్తున్నారు. అంతేకాదు టిక్కెట్‌ మాకంటే మాకంటూ ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నుంచి బరిలో దిగేందుకు .. ఇద్దరు నుంచి ముగ్గురు నాయకులు పోటీపడుతున్నారు. 

జిల్లాలో పార్టీ పరిస్థితులు నియోజకవర్గాల్లోని ప్రత్యర్ధులపై ఒక అవగాహనకు వచ్చిన వైసీపీ అధిస్టానం.. తనదైన శైలిలో నేరుగా విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపి .. బలమైన అభ్యర్ధులను వైసీపీ కండువా కప్పుకునేలా చేసింది. వ్యూహ.. ప్రతివ్యూహలు రచిస్తూ దగ్గుబాటి వెంకటేశ్వర్లరావు, మానుగుంట మహిదర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి వంటి రాజకీయ చరిష్మా ఉన్న కుటుంబాలను తమవైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. ఇదే పరిస్థితుల్లో ఏళ్లతరబడి పార్టీ జెండా మోసిన వైసీపీ సమన్వయకర్తలు .. ఎన్నికల ప్రాబబుల్స్‌లో రెండవ స్థానంలో ఉండటంతో .. వారు కూడా తమకున్న పరిచయాలతో సీటుకోసం పాట్లు పడుతున్నారు. ఇదే పరిస్థితుల్లో తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే .. అధినేత జగన్ కొత్త అభ్యర్ధులను నియోజకవర్గాల్లో తీసుకోవడంతో .. పార్టీ సమన్వయకర్తలు డైలామాలో పడ్డారు. తమకు సీటివ్వకపోతే సొంతపార్టీ అభ్యర్ధిని సైతం ఓడించేందుకు పావులుకదుపుతున్నారు.  ముఖ్యంగా మార్కాపురం, పర్చూర్, కొండేపి, గిద్దలూరు ప్రాంతాల్లోని అసంతృప్తులు .. ఎప్పటినుండో తమ వ్యూహాలు సిద్దంచేసుకున్నారు. ఇప్పుడు ఇదే వైసీపీని కలవర పెడుతోంది.  

మరోవైపు టీడీపీ అధిష్టానం మాత్రం నియోజకవర్గాల్లోని వర్గపోరును ముందుగానే పసిగట్టింది. ఇంటిపోరును చక్కబెట్టుకునేందుకు ఆయా నియోజకవర్గాల అసంతృప్తులను అమరావతికి పిలిపించుకుని .. చంద్రబాబే  స్వయంగా బుజ్జగించారు. వారి సమస్యలకు అక్కడే సమాధానం చెప్పారు. దీంతో  జిల్లాలోని రెండు ఎస్సీ నియోజకవర్గాలు మినహాయిస్తే .. మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రజాబలమే తమను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్న వైసీపీ…ఎన్నికల బరిలో నిలిచే నాయకులేవరనేది త్వరగా తేల్చాలని కార్యకర్తలు కోరుతున్నారు. సొంతింటిని చక్కబెట్టుకోకపోతే .. గత అనుభవాలే పునరావృతమవ్వక తప్పదని రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు.