వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి తోట వాణి

తెలుగు దేశం పార్టీకి షాక్ తగలనుంది. కాకినాడ ఎంపీ తోట నర్సింహ్మ దంపతులు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు.

  • Publish Date - March 12, 2019 / 09:52 AM IST

తెలుగు దేశం పార్టీకి షాక్ తగలనుంది. కాకినాడ ఎంపీ తోట నర్సింహ్మ దంపతులు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు.

తూర్పు గోదావరి : తెలుగు దేశం పార్టీకి షాక్ తగలనుంది. కాకినాడ ఎంపీ తోట నర్సింహ్మ దంపతులు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. మార్చి 13 బుధవారం జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు తోట వాణి ప్రకటించారు. పెద్దాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కచ్చితంగా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. 

15 ఏళ్లుగా జిల్లాకు సేవ చేశామని, అధిష్టానం గుర్తించలేదని వాపోయారు. తన భర్తకు జిల్లాలో సముచిత స్థానం ఇవ్వలేదని కంటతడి పెట్టారు. అందుకే పార్టీ మారాల్సివచ్చిందన్నారు. అధిష్టానం గుర్తించకుండా హోంమంత్రి చినరాజప్ప అడ్డుపడ్డారని ఆరోపించారు. తోట నర్సింహ్మ టీడీపీని వీడటం ఖాయంగా భావిస్తూ రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది. స్వంత నియోజకవర్గం అయిన జగ్గంపేట నుంచి తోట వాణి టికెట్ ఆశించింది. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ వైపు చంద్రబాబు మొగ్గుచూపడంతో తోట వాణి అనివార్యంగా పార్టీ మారుతుండటం, పెద్దాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగనుండటంతో ఈ పోరు మరింత రసవత్తరంగా మారనుంది. 

పెద్దాపురం నుంచి ప్రస్తుతం హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినథ్యం వహిస్తున్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే స్థానానికి టీడీపీ తరపున ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇప్పుడు చినరాజప్పపై వైసీపీ నుంచి తోట వాణి పోటీ చేస్తున్నారు. గతంలో తోట వాణి తండ్రి మెట్ల సత్యనారాయణ, చినరాజప్ప మధ్య వైరం ఉంది. మెట్ల సత్యనారాయణ టీడీపీలో చేరినప్పటి నుంచి ఇరువురి మధ్య వర్గపోరు సాగుతూవుండేది. సత్యనారాయణ మరణం తర్వాత కూడా ఆ వైరం కొనసాగుతుందని ఇటీవల చినరాజప్ప తెలిపారు.