సదావర్తి భూముల వేలంపై విజిలెన్స్ విచారణ

  • Publish Date - September 3, 2019 / 10:58 AM IST

సదావర్తి సత్రం భూముల వేలంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ మంగళవారం. సెప్టెంబర్ 3, 2019 న ఉత్తర్వులు జారీ చేశారు.  

ఈ భూముల వేలానికి సంబంధించిన అన్ని రికార్డులను తక్షణమే విజిలెన్స్ అండ్  ఎన్ ఫోర్స్ మెంట్  అధికారులకు అందచేయాలని  దేవాదాయ శాఖ కమీషనర్ ను కూడా ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నైలో భూములు ఉన్నాయి. చాలా భూములు కబ్జాకు గురయ్యాయి. మిగిలిన భూములలో 83.11 ఎకరాలకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వం వేలం నిర్వహించింది. 

83.11 ఎకరాలు భూములను టీడీపీ నేత, కాపు  కార్పోరేషన్ మాజీ చైర్మన్ రామాంజనేయులు  తక్కువ ధరకు దక్కించుకున్నారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఈ కేసు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లింది . సదావర్తి భూముల వేలంపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గతంలోనే చెప్పారు.