విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావటానికి కారణం ఇదేనా …

  • Publish Date - December 17, 2019 / 02:28 PM IST

ఆంధ్రప్రదేశ్‌కు బహుశా మూడు రాజధానులు రావొచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శాసనసభలో మంగళవారం రాజధానిపై చర్చ జరిగిన సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… అధికార వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. రాజధాని ఒకే చోట ఉండాలన్న ఆలోచన ధోరణి మారాలని, దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు మూడు రాజధానులు ఉన్నాయని అన్నారు.

విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌, కర్నూలులో జ్యుడీషియల్‌ క్యాపిటల్‌, అమరావతిలో లేజిస్లేటివ్‌ క్యాపిటల్‌ పెట్టొచ్చు. మూడు క్యాపిటల్స్‌ రావాల్సిన పరిస్థితి కనిపిస్తావుందని ఆయన అసెంబ్లీలో అన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెడితే పెద్దగా ఖర్చవదు. ఉద్యోగులు పనిచేయడానికి కావాల్సిన సదుపాయాలన్నీ అక్కడ ఉన్నాయి. ఒక మెట్రోరైలు వేస్తే సరిపోతుందని  సీఎం తెలిపారు. ఇటువంటి ఆలోచనలు సీరియస్‌గా చేయాలి. ఇటువంటి ఆలోచనలు చేయడం కోసమే నిపుణులతో ఒక కమిటీని వేశాం. ఈ కమిటీ అధ్యయనం చేస్తోందని.. వారం పదిరోజుల్లో నివేదిక ఇవ్వనుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని ఎలా నిర్మిస్తే బావుంటుందనే దానిపై సుదీర్ఘమైన నివేదికను కమిటీ తయారు చేస్తోందని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. 

సీఎం ప్రకటనతో సెక్రటేరియేట్  విశాఖకు తరలివెళ్లే అవకాశం ఉంది.  పరిపాలనా వ్యవహారాలు విశాఖ నుంచి జరిగే అవకాశం ఎంతవరకుఉందనేది నిపుణుల కమిటీ  నివేదిక వచ్చాక పూర్తి క్లారిటీ వస్తుంది. ఇదే జరిగితే మిగతా నగరాల కంటే  విశాఖపట్నం మరింత వేగంగా అభివృధ్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే విశాఖ నగరం ఇటు అనకాపల్లివైపు అటు విజయనగరం వైపుకు బాగా అభివృధ్ది చెందింది.

పరిపాలనకు అనువైన వాతావరణం, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు విశాఖలో ఉండటం వల్లే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకోవడానికి కారణమై ఉంటుందనే ప్రచారం సాగుతోంది. సీఎం కూడా సభలో మెట్రో రైలు వేస్తే సరిపోతుందనే అభిప్రాయం వెలిబుచ్చారు. విశాఖలో ప్రభుత్వ భూములు కూడా ఎక్కువగా ఉండటంతో… ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

విశాఖను రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ చేయడం వల్ల కూడా వెనుక బడిన  ప్రాంతమైన ఉత్తరాంధ్ర ప్రజలను సంతృప్తి పరచవచ్చని ప్రభుత్వం భావించి ఉండొచ్చని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంపై స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం సభలో మాట్లాడారు. మొత్తానికి  సీఎం ప్రకటనతో  రాజధాని నిర్మాణంపై కొన్నిసందేహాలు తీరాయి.