పరిమళ్‌ నత్వానీకి రాజ్యసభ సీటు… జగన్ వ్యూహం ఏంటి ?

  • Published By: chvmurthy ,Published On : March 10, 2020 / 02:19 AM IST
పరిమళ్‌ నత్వానీకి  రాజ్యసభ సీటు… జగన్ వ్యూహం ఏంటి ?

Updated On : March 10, 2020 / 2:19 AM IST

పారిశ్రామికవేత్త  పరిమళ్‌ ధీరజ్‌లాల్‌ నత్వానీకి  వైసీపీ అధినేత  జగన్‌ రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చారు ? వైసీపీలో చాలా మంది ఆశావహులున్నా ఓ పారిశ్రామికవేత్తకు  టికెట్‌ ఎందుకు ఖరారు చేశారు ? నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుకున్న రహస్యమేంటి ?  జగన్‌ ఏం ఆశించి నత్వానీని రాజ్యసభకు పంపుతున్నారు?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నుంచి పెద్దల సభకు వెళ్లే  నలుగురి పేర్లు  సోమవారం ప్రకటించారు.  వారిలో  ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, పార్టీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబానీ సన్నిహితుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల ప్రెసిడెంట్‌ పరిమల్‌ ధీరజ్‌లాల్‌ నత్వానీని ఎంపిక చేశారు.

వీరిలో ముగ్గురు పార్టీకి చెందిన వారుకాగా….నాలుగో వ్యక్తి పారిశ్రామికవేత్త. ఆయనే  పరిమళ్‌ ధీరజ్‌లాల్‌ నత్వానీ. ఈయనకు వైసీపీతో ఎలాంటి సంబంధమూ లేదు. అయినా ఆయనకు జగన్‌ రాజ్యసభ సీటును ఖరారు చేశారు. నాలుగో అభ్యర్థిగా పేరు ఖరారు చేసినా.. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్నారు

పరిమళ్‌ ధీరజ్‌లాల్‌ నత్వానీ.. రిలయన్స్‌ అధిపతి ముఖేశ్‌ అంబానీకి అత్యంత సన్నిహితుడు. అంబానీ అభ్యర్థన మేరకే నత్వానీకి జగన్‌ రాజ్యసభ సీటును ఖరారు చేశారు. గత నెల 29న ముఖేశ్‌ అంబానీ జగన్‌ను కలిశారు. ఆ సమయంలో అంబానీ నత్వానీని కూడా వెంటబెట్టుకొచ్చారు. వారి అంబానీ, జగన్‌ మధ్య పరిశ్రమలు, పెట్టుబడులపై చర్చ జరిగినట్టు ప్రచారం జరిగింది.  అయితే నత్వానీ రాజ్యసభ సీటుపై  అప్పుడు చర్చించినట్టు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించడంతో తెలుస్తోంది.

నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుక రాజకీయ వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖేశ్‌ – నత్వానీలకు కమలం పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో వారి పరిచయాన్ని తమ రాష్ట్రాభివృద్ధికి వినియోగించుకోవాలని జగన్‌ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీకి సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్‌ బిల్లులు చాలా ఉన్నాయి. విభజన హామీలు కూడా అమలుకు నోచుకోలేదు. అంతేకాదు.. వెనుకబడిన జిల్లా నిధులు, పోలవరం ప్రాజెక్టు నిధులతోపాటు కడప స్టీల్‌ప్లాంట్‌ లాంటి ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలుపలేదు. 

ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం అంబానీ పరిచయాన్ని జగన్‌ వినియోగించుకుంటారన్న  ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముఖేశ్‌ ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిని ఆశించే ముఖేష్‌ కోరిన సాయాన్ని జగన్‌ కాదనలేకపోయినట్టు తెలుస్తోంది.

విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కూడా సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని పెంపొందించేందుకే పరిమల్‌ ధీరజ్‌లాల్‌ నత్వానీని రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. 

పరిమల్‌ నత్వానీ 2008లో తొలిసారిగా జార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014లో జార్ఖండ్‌ నుంచే తిరిగి ఎన్నికయ్యారు. ఈసారి జార్ఖండ్‌లో బీజేపీ ఓటమి చెందడంతో మెజారిటీ కోల్పోయింది. దీంతో నత్వానీని ఏపీ నుంచి ఎంపిక చేసేందుకు ముకేశ్‌ అంబానీ స్వయంగా రంగంలోకి దిగారు.  1990లో పారిశ్రామిక వేత్తగా ఉన్న పరిమళ్ ధీరజ్‌లాల్ నత్వానీ 1997లో  రిలయన్స్ గ్రూప్‌లో చేరారు.

2016 నాటికి ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ అఫైర్స్‌ గ్రూప్ ప్రెసిడెంట‌్‌ స్థాయికి  ఎదిగారు. ముకేశ్‌తోనే కాదు ఆయన తండ్రి ధీరూభాయి అంబానీతోనూ నత్వానీ కలిసి పని చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కోర్ లీడర్‌షిప్‌లో ఆయన కీలక సభ్యుడు. జామ్‌నగర్ రిఫైరీ కోసం 10 వేల ఎకరాల భూమిని సేకరించడంలో నత్వానీ ముఖ్యపాత్ర పోషించారు. రిలయన్స్ 4జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులోనూ నత్వానీ కీలకంగా వ్యవహరించారు. 

See Also | YSRCP నిర్లక్ష్యమే TDPకి బలంగా మారుతుందా!?