అఫ్రీది.. నిన్ను సైక్రియాట్రిస్ట్‌కు చూపిస్తా రా: గంభీర్

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది చేసిన కామెంట్లకు గౌతం గంభీర్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చాడు. ‘షాహిద్ అఫ్రీది నువ్వొక వింతమనిషి. ఏమైనా పర్లేదు. భారత్ మెడికల్ టూరిజం కోసం ఇప్పటికీ వీసాలను అనుమతిస్తుంది. నువ్వు వచ్చావంటే నిన్ను నేనే దగ్గరుండి సైక్రియాట్రిస్ట్‌కు చూపిస్తా’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 

అఫ్రీది తన ఆత్మకథను గేమ్ చేంజర్ అనే పుస్తకం ద్వారా అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నాడు. అందులో గంభీర్‌కు అసలు వ్యక్తిత్వమే లేదని, కేవలం అటిట్యూడ్ మాత్రమే ఉందన్నాడు. తానేదో బ్రాడ్ మన్, జేమ్స్ బాండ్ తరహా వ్యక్తిలా ఊహించుకోవడం తప్ప అతని పేరిట రికార్డులు కూడా ఏం లేవని తీసిపారేశాడు. వాటిపై స్పందించిన గంభీర్ ఈ విధంగా ట్వీట్ రూపంలో కౌంటర్ ఇచ్చాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పేసిన గౌతం గంభీర్.. బీజేపీ కండువా కప్పి రాజకీయాల్లోకి ఆహ్వానించడంతో మరో ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఢిల్లీ ఈస్ట్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రచారంలో బిజీ అయిపోయాడు.