విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

  • Publish Date - January 30, 2020 / 03:30 PM IST

విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖ రాజధానికి మద్దతు ఇవ్వాలంటూ వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు, ఎమ్మెల్యే వెలగపూడి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.  సర్క్యూట్‌ హౌస్‌ నుంచి కాగడాల ర్యాలీ నిర్వహించారు.  నగరానికి చెందిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సెవెన్‌హిల్స్‌ జంక్షన్‌లోని టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు మహిళలు ప్రయత్నించారు. 


టీడీపీ నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులుగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, గణేశ్‌కుమార్‌ విశాఖ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమ ఓట్లతో గెలిచి విశాఖపట్నానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేల నాటకాలను విశాఖ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. పదవులను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నారు తప్పా ఓట్లు వేసి గెలిపించిన తమకు న్యాయం చేయాలన్న ఆలోచన టీడీపీ ఎమ్మెల్యేలకు లేదని ధ్వజమెత్తారు.
 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలైన ఉత్తరాంధ్ర ఇప్పటికి వెనుబడి ఉందన్నారు. అధికార వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్   చూస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే తప్పకుండా విశాఖ పరిపాలనా రాజధాని కావాలని స్పష్టం చేశారు.

టీడీపీ నాయకులు అడ్డుపడితే ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని హెచ్చరించారు. ‘పరిపాలన వికేంద్రీకరణ కావాలి. విశాఖ రాజధాని కావాలి’ అని ప్రజలంతా కోరుకుంటున్నారని  తెలిపారు.  సమాచారం  తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను అదుపు చేశారు.