ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నారాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తున్నాడని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైసీపీ సమరశంఖారావం సభలో ప్రసంగించిన జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని, తెలంగాణలో 20 లక్షల దొంగ ఓట్లు ఉంటే.. ఒక్క మన రాష్ట్రంలో 39 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండే కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా చంద్రబాబుకు చెందిన ప్రైవేటు కంపెనీల దగ్గర ఎలా దొరుకుతోందంటూ ప్రశ్నించారు. ఈ రకంగా ప్రజలకు సంబంధించిన ఎన్నికల డేటా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందంటే తప్పు ఎవరిదంటూ చంద్రబాబు తీరును ఎండగట్టారు జగన్.
ప్రభుత్వం దగ్గర ఉండే ఆధార్ డేటా చోరికి గురైందని, చోరీ గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే మనల్ని, మన కార్యకర్తలపైనే తిరిగి అధికార పార్టీ నిందిస్తుందని అన్నారు. ఎల్లో మీడియా అండతో రెచ్చిపోతున్న చంద్రబాబు.. సరైన ఓట్లు చేర్పించమని అడిగితే మనమే వ్యవస్థలను నాశనం చేస్తున్నామంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు సభకు తరలిరాగా సీఎం చంద్రబాబును గద్దె దించాలని జగన్ పిలుపునిచ్చారు.