Tirumala Temple Closed : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజున ఆలయం మూసివేత

25న సూర్యగ్రహణం కారణంగా ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఈ కారణంగా 24, 25 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.

Tirumala Temple Closed : తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం, సూర్యగ్రహణం కారణంగా రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. శ్రీవారికి ఈ నెల 24న దీపావళి ఆస్థాన వేడుక నిర్వహించనున్నారు. ఇక 25న సూర్యగ్రహణం కారణంగా ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు ఆలయం మూసివేయనున్నారు. ఈ కారణంగా 24, 25 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.

ఈరోజుల్లో అన్నప్రసాద పంపిణీ కూడా నిలిపివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని భక్తులంతా గమనించాలని సూచించింది. ప్రస్తుతం దసరా సెలవులు ముగిసినా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. నిత్యం 70 వేలకు మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వీకెండ్స్ లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది.

అదే సమయంలో తిరుచానూరులో ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సైతం మూసివేయనున్నారు. సూర్య‌గ్ర‌హ‌ణం కార‌ణంగా అక్టోబ‌ర్ 25వ తేదీ ఉద‌యం 8 నుండి రాత్రి 7 వ‌ర‌కు తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆలయ తలుపులు మూసి ఉంచుతామని టీటీడీ ప్రకటించింది. అక్టోబ‌ర్ 25న సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుందన్నారు. గ్రహణం వీడిన తర్వాత ఆల‌య తలుపులు తెరిచి శుద్ధి, పుణ్య‌హ‌వ‌చ‌నం, కైంక‌ర్యాలు చేప‌డ‌తామన్నారు.

అదే విధంగా న‌వంబ‌ర్ 8న మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8 నుండి రాత్రి 7 గంట‌ల‌కు అమ్మ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారని టీటీడీ ప్రకటించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మరోవైపు 25వ తేదీన యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహస్వామివారి ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. సూర్యగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో 25న ఉదయం 8.50 నిమిషాల నుంచి మరసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 25న భక్తులతో నిర్వహించాల్సిన నిత్య కల్యాణం, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేసినట్లు తెలిపారు.

26న స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించే శతఘట్టాభిషేకం, సహస్రనామార్చన, సుదర్శన నరసింహ హోమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. 26న సంప్రోక్షణ నిర్వహించి ఉదయం 10:30 గంటల నుంచి ఆలయాన్ని తెరిచి యథావిధిగా స్వామివారి నిత్య కైంకర్యాలు జరిపిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు