Kamandala Ganapathi Temple : కమండల గణపతి దేవాలయం.. స్వామి పాదాలవద్ద పొంగిపొర్లే పవిత్ర గంగాజలం విశిష్టత

అది వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఓ అద్భుత దేవాయలం. యోగ ముద్రతో దర్శనమిచ్చే స్వామి. ఆ స్వామి పాదాల చెంత పొంగిపొర్లే పవిత్ర గంగాజలం. ఈ నీటిని సేవిస్తే సకల రోగాలు మటుమాయం అవుతాయట..

Kamandala Ganapathi Temple : కమండల గణపతి దేవాలయం.. స్వామి పాదాలవద్ద పొంగిపొర్లే పవిత్ర గంగాజలం విశిష్టత

Kamandala Ganapathi Temple In Karnataka : భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు..మరెన్నో అత్యద్భుతమైన దేవాలయాల నిర్మాణాలు ఈనాటికి మిస్టరీగా ఉన్నాయి. ఈ మిస్టరీలను ఛేదించేందుకు ఎంతోమంది పరిశోధనలు చేసినా వీడలేదు. అవి కేవలం రహస్యాలు కాదు మానవాతీత ఆధ్యాత్మిక శక్తులు అని భగవంతుడి లీలలు అని భక్తుల నమ్మకం. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన అటువంటి ఓ అద్భుత దేవాయలం గురించి తెలుసుకుందాం..

అది కర్ణాటకలోని చిక్క మంగళూరు జిల్లా కొప్ప పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి దట్టమైన అటవీ ప్రాంతం. పచ్చని ప్రకృతికి పుట్టినిల్లుగా ఉండే ఆ ప్రదేశంలో గణపయ్య ఆలయం ప్రసిద్ధి చెందింది. గణపయ్యకు ఎన్నో పేర్లున్నా ఈ దేవాలయంలో మాత్రం ‘కమండల గణపతి’ పేరుతో పూజలందుకుంటున్నాడు. గణపతి, వినాయకుడు,గణనాధుడు అనే ఎన్నో పేర్లు కలిగిన విఘ్నేశ్వరుడు ‘కమండల గణపతి’గా వెలిసిన ఈ దేవాలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది. ఈ స్వామి పాదాల వద్ద గంగాజలం పొంగిపొర్లుతుంటుంది. కమండలం గణపతి పాదాల వద్ద పొంగిపొర్లే ఈ పవిత్రమైన గంగాజలం సాక్షాత్తు బ్రహ్మదేవుడు కమండలం నుంచి పోశాడని చెబుతారు. అందుకే ఈ నీటినుంచి ప్రవహించిన నీరు బ్రాహ్మి నది (Brāhmi River)గా మారిందని చెబుతారు.

ఈ దేవాయలం స్థల పురాణం విషయానికి వస్తే..శనిదేవుడు వక్ర దృష్టి పడితే సాక్షాత్తు దేవతలే కాదు..ఆ పార్వతీదేవే కష్టాలు పడిందని పురాణాలు చెబుతున్నాయి. అలా శని వక్రదృష్టి పడిన పార్వతీదేవి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నదటం ఆ ఆదిపరాశక్తి. అలా శనిదేవుని ప్రభావంతో పార్వతీదేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయటానికి వచ్చిందట. అలా వచ్చిన ఆ జగన్మాత విఘ్నాలు తొలగించే వినాయకుడిని ప్రార్థించిందట. అమ్మ పార్వతీదేవి కోరిక మేరకు వినాయకుడు ప్రత్యక్షమయ్యాడట. బ్రహ్మచారి రూపంలో కమండలం ధరించి..ప్రత్యక్షమయ్యాడట. అలా ప్రత్యక్షమైన వినాయకుడు సృష్టించిన తీర్థాన్ని బ్రహ్మ తీర్థం అని చెబుతారు.ఈ విధంగా వినాయకుడు కమండలం ధరించి ఉండటంవల్ల ఈ ఆలయానికి కమండల గణపతి అనే పేరు వచ్చింది.

ఈ ఆలయంలో పూజలందుకుంటున్న గణపయ్య యోగ ముద్రలో కూర్చుని భక్తులకు దర్శనమిస్తాడు. వర్షాకాలంలో పుష్కరిణిలో ఉండే నీరు స్వామివారి పాదాలకు తాకుతుంది.ఈ సమయంలో స్వామివారిని దర్శించి ఆ నీటిని మహా తీర్థ ప్రసాదంగా తీసుకుంటారు భక్తులు. ఈ నీటిని సేవిస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. పుష్కరిణిలోని నీరు వినాయకుడి పాదాలను తాకడం వల్ల ఇక్కడ వెలసిన స్వామివారిని కమండల గణపతి అని కూడా పిలుస్తారు.

ఈ స్వామివారి ఆలయంలో పూజలు మధ్యాహ్నం వరకే నిర్వహిస్తారు కనుక స్వామివారిని దర్శించుకోవాలంటే తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ కమండలం గణపతి పాదాల నుంచి పొంగిపొర్లే ఈ నీరు బ్రాహ్మీ నదికి మూలమని చెబుతారు. పురాణాల ప్రకారం ఈ నీటిని బ్రహ్మదేవుడు తన కమండలం నుంచి పోశాడని చెబుతారు. మరి గణపయ్య పాదాల వద్ద పొంగిపొర్లే గంగాజలాన్ని ఈ వీడియోలో చూసి తరించండి..