Thiruvannamalai
Tiruvannamalai Karthigai Deepam 2021 : పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటైన తిరువణ్ణామలైలో రేపటి నుంచి కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అరుణాచల క్షేత్రంలో కార్తీక దీప బ్రహ్మోత్సవాలు ఈనెల10వ తేదీన ధ్వజారోహణతో ప్రారంభమై అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
ఏడవ రోజు మంగళవారం నాడు అన్నామలైయర్, ఉన్నామలై అమ్మన్, పరాశక్తి అమ్మన్, వెండి విమానంలో పంచమూర్తులు, గణేశుడు, మురుగన్, చండికేశ్వరులను రధాలలో ఉరేగించి భక్తులకు దర్శనం కల్పించారు. కాగా…… కోవిడ్ నింబంధనల అమలులో భాగంగా ఈనెల 18,19 తేదీల్లో జరిగే కార్తీక దీపోత్సవానికి భక్తులను అనుమతించటం లేదని కలెక్టర్ బి.మురుగేష్ తెలిపారు.
Also Read : Karthika Pournami 2021 : ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి
ఈనెల 17 నుంచి 20 వ తేదీ వరకు తిరువణ్ణామలైలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేసి తీరుతామని … ఈ నాలుగు రోజులు ఆలయంలోకి భక్తులను కూడా అనుమతించేది లేదని ఆయన తెలిపారు. కార్తీకమాస బ్రహ్మోత్సవాలు, స్వామికి జరిగే అన్ని సేవలు ఏకాంతంలో అర్చక స్వాముల ద్వారా నిర్వహిస్తామని వివరించారు.
Tv Malai Brahmotsavalu
19వ తేదీ అరుణాచలం కొండపై వెలిగించే కార్తీక దీపోత్సవాన్ని కూడా ఆలయ పూజారులు, వంశపారం పర్యంగా వస్తున్న వంశీకులతో కొద్దిమందితో మాత్రమే నిర్వహిస్తామన్నారు. సాధారణంగా కార్తీక పౌర్ణమికి తిరువణ్ణామలై లో కార్తీకదీపాన్ని దర్శించి గిరి ప్రదక్షిణం చేయటానికి దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి సుమారు 20లక్షల మంది ప్రజలు తిరువణ్ణామలైకి వస్తారు.
Also Read : Lunar Eclipse 2021 : కార్తీక పౌర్ణమికి చంద్రగ్రహణం ఉందా? లేదా ?
కోవిడ్ పూర్తిగా అదుపులోకి రానందున ఎక్కువ సంఖ్యలో తిరువణ్ణామలైకి భక్తులు రాకుండా 17వ తేదీ నుంచి నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం తెలిపిన వివరాల ప్రకారం 17వ తేదీ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 20 వ తేదీ శనివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు అరుణాచలేశ్వర ఆలయంలోకి భక్తులెవరకీ దర్శనానికి అనుమతించరు.
అదే సమయంలో గిరిప్రదక్షిణం చేసే 14 కిలోమీటర్ల మార్గాన్ని కూడా మూసి వేసి పోలీసులు పర్యవేక్షిస్తూ ఉంటారు. అరుణాచలం కొండపైకి వెళ్ళటానికి ఇతరులెవ్వరికీ అనుమతి లేదని కేవలం పూజారులు, ప్రభుత్వం అనుమతించిన కొద్ది మంది మాత్రం వెళ్లి కార్తీకదీపం వెలిగించి వస్తారని తెలిపారు. తిరువణ్ణామలై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పవన్ కుమార్ నేతృత్వంలో కోవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసు యంత్రాంగం సమాయత్తమయ్యింది.
నవంబర్ 19 కార్తీక దీపోత్సవం సందర్బంగా తిరువణ్ణామలై లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్ధలు, ప్రైవేట్ వ్యాపార సంస్ధలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అందుకు బదులుగా డిసెంబర్ 4న అన్ని కార్యాలయాలు పని చేయాలని జిల్లా కలెక్టర్ బి.మురుగేష్ ఆదేశాలు జారీ చేశారు.