Yearly Horoscope 2025: ఈ ఏడాది మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఈ రాశి వారికి ఏడున్నర సంవత్సరాల శనిపీడ నుంచి రిలీఫ్
కొత్త ఏడాది వచ్చేసింది. 2025లో ఏయే రాశుల వారికి ఏ విధంగా ఫలితాలు ఉంటాయి? ఎవరికి మంచి ఫలితాలు ఉంటాయి? ఏ రాశుల వారు ఏయే దేవతలను ఆరాధించాలి? ఈ వివరాలను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీకృష్ణ సుధీ అందించారు.

రాశుల వారీగా గత ఏడాది కంటే అందరి రాశుల ఫలితాలు బాగున్నాయి. 2024తో పోల్చితే 2025లో అన్ని రాశాల వారికి చాలా విశేష లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. 2024 ఏడాది ఎన్నో తీపి గుర్తులను మిగిల్చి వెళ్లింది. ఆ ఏడాదితో పోల్చితే 2025 ఇంకా బాగుంటుంది.
మేషరాశి (♈ Aries (Ram)): 2025లో ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి. ఏలినాటి శని ప్రారంభమవుతుంది. గురుడు ద్వితీయం నుంచి జూన్ నుంచి తృతీయ శ్వాసలోకి వెళ్తాడు. గురుడి ద్వారా ఉండే ఆర్థిక అనుకూలతలు జూన్ వరకు ఉంటాయి. ఆ తర్వాత తగ్గుతాయి. ఏలినాటి శని ప్రారంభమై ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రణాళికలు ఆలస్యం అవుతాయి. పనులు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులకు ఈ ఏడాది పరీక్షా కాలమే.
గురుడు బాగుంటే పరీక్షల్లో మంచి ఫలితాలు ఉంటాయి. శని ఉంటే ఆరోగ్య రీత్యా బాగుంటుంది. శని, రాహు ఇద్దరూ మే వరకు వ్యయ స్థానంలో కలుస్తున్నారు. ఏలినాటి శని ప్రారంభమైందన్నదానికి సూచికగా ఏదో ఒక ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమవుతాయి. ఇంట్లో వారికి కూడా ఔషధ సేవలు వంటివి అవసరం ఉంటాయి.
పరిహారంగా… శనిప్రదోషం చేయాలి. శనివారం నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివుడికి, వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేయాలి. ఏడు శనివారాల వ్రతం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది.
వృషభం (♉ Taurus (Bull)): ఈ రాశివారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. గురుడు ఈ రాశిలో ఉన్నాడు. ఇక్కడి నుంచి ధన స్థానానికి వెళ్తాడు. స్థాన మార్పు, ప్రమోషన్లు కోరుకునే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వివాహం కాని వారికి వివాహపర అనుకూలతలు ఉంటాయి. రెండేళ్లుగా ఉన్న సమస్యల నుంచి బయటపడతారు.
మార్చి నుంచి మే వరకు మంచి ఫలితాలు ఉంటాయి. చెడు చేసే గ్రహాలన్నీ చెడ్డ స్థానంలో ఉన్నాయి కాబట్టి వీరికి మంచి జరుగుతుంది. వ్యాపారం, బ్యాంకు చిట్స్ వంటి వారికి కలిసి వస్తుంది. జూన్ దగ్గరి నుంచి కలిసి వస్తాయి. విదేశీయానాలు లాభదాయకంగా ఉంటాయి.
మరింత మంచి ఫలితాల కోసం.. గురుగ్రహ సంబంధమైన గురువార నియమం పాటిస్తే మంచిది. ఈ రాశిని వేధించింది గురుడే.. యోగం చేసేది గురుడే. అన్ని ప్రయత్నాలూ ఫలిస్తాయి. 2025 వృషభనామ సంవత్సరం అని చెప్పొచ్చు.
మిధున రాశి (♊ Gemini (Twins)): నష్టాలు బాగా ఉంటాయి. ఇబ్బందులు అధికంగా ఉంటాయి. గురుడు ఈ రాశిలో ప్రవేశించడు. ధనస్థానంలో కుజుడు ఉంటాడు. దాదాపు ఆరు నెలల పాటు కుజస్తంభన ఉంటుంది. కుటుంబంలో అపశ్రుతులు, భార్యాభర్తల మధ్య సమస్యలు. శనికూడా రాజ్యస్థానానికి వస్తాడు.
ఇంట్లోని పెద్ద వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. దారినపోయేది వచ్చి ఇబ్బందులు పెడుతుంది. రాజకీయ నాయకులకు కూడా అత్యంత గడ్డు కాలం. ఏకాకులుగా మిగులుతారు. విద్యార్థులకు కూడా మార్కుల ఫలితంగా తక్కువ స్థాయిలో ఉంటుంది. రైతులకు ఫలితం ఆశించినంత ఉండదు. కానీ, కృషి చేస్తే కొంత ఫలితం ఉంటుంది. మంచి ఫలితాల కోసం.. గురుగ్రహ శాంతి చేయాలి. దక్షిణామూర్తిని ఆరాధించాలి.
కర్కాటక రాశి (♋ Cancer (Crab)): ఈ రాశి వారికి అత్యద్భుతమైన కాలం. ఫలితం రాలేదని గతంలో వదిలేసినవి కూడా ఇప్పుడు వసూలు అవుతాయి. పెండింగ్ బిల్స్ ఉంటే వస్తాయి. భార్యాభర్త మధ్య మంచి వాతావరణం ఉంటుంది. మంచి యోగాలు వస్తాయి. విదేశాల నుంచి కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
ఖర్చులు అయినా కూడా మంచి పనులకే జరుగుతుంది. రాహువు మే నుంచి అష్టమంలోకి వస్తున్నాడు. రాహు అష్టమంలో ఉంటే కీర్తి వస్తుంది. ప్రతిష్ఠలు మళ్లీ వెలుగొందుతాయి. ఉత్సాహభరితమైన వాతావరణం వస్తుంది. మంచి ఫలితాల కోసం.. స్త్రీ శక్తిని ఆరాధించాలి. అమ్మవారిని ఆరాధించాలి.
సింహరాశి (♌ Leo (Lion)): సింహరాశి వారికి 2025లో గత ఏడాదితో పోల్చితే మెరుగైన ఫలితాలు ఉన్నాయి. వీరికి కొంత నిర్మాణ సంబంధమైన కార్యక్రమాలు వేగంగా మాత్రం నడవవు. పనులు ఆలస్యం అవుతాయి. కానీ, చివరకు పూర్తిగా జరుగుతాయి. శని సంబంధమైన ఆలస్యం తొలగడం కోసం పరిహారాలు చేసుకుంటే మంచిది.
కేతువు రాశిలో ఉన్నప్పుడు పనులు ఆలస్యం అవుతాయి కాబట్టి నిత్యం గణపతిని ఆరాధించాలి. వివాహ విషయంలో ఆలస్యం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. వీరికి ఓపిక కావాలి. మంచి ఫలితాల కోసం.. శనికి పరిహారం చేయాలి. ఆంజనేయ స్వామిని ఆరాధించాలి.
కన్యా రాశి (♍ Virgo (Virgin)): కేతువు మే నుంచి ఈ రాశి వారికి సింహరాశిలోకి వెళ్తాడు. మార్చి, మే తర్వాత కొత్త ఉత్సాహం వస్తుంది. ఎక్కువగా లాభపడతారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వీళ్లని పట్టించుకోని వారు కూడా వెతుక్కుంటూ వస్తారు. తగిన గుర్తింపు లభిస్తుంది. కంగారు పడాల్సిన అవసరం ఉండదు. మంచి ఫలితాలు వస్తాయి. మంచి భవిష్యత్తు ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. మంచి ఫలితాల కోసం… వెంకటేశ్వరస్వామిని ఆరాధించాలి. బిళ్వపత్రార్చన చేయాలి.
తుల రాశి (♎ Libra (Balance)): ఈ ఏడాది సగం కష్టాలు, సగం సంతోషాలు ఉంటాయి. గురువు అష్టమంలో ఉంటాడు. అనారోగ్య సమస్యలు వస్తాయి. గొంతు సమస్యలు, లివర్ సమస్యలు వంటివి బాధించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఏది తలపెట్టినా వాయిదాలు అవుతాయి. జూన్‌లో గురుడు మారతాడు.
ఆ తర్వాత మంచి ఫలితాలు వస్తాయి. కోర్టు కేసుల్లో, అప్పులు వంటి విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. అప్పటి వరకు వేచి చూస్తే మంచిది. తొందరపడితే ఆర్థికంగా గురుడు దెబ్బ తీస్తాడు. జూన్ నుంచి అంటే రెండో అర్ధ భాగంగా బాగుంది.
మంచి ఫలితాలు రావాలంటే.. దత్తాత్రేయ స్వామిని ఆరాధాన, మేడి చెట్టుకు సంబంధించిన పూజలు చేయాలి. గురుగ్రహ శాంతులు చేయాలి. పెద్దవారిని గౌరవించాలి. వారి ఆశీస్సులతో మంచి ఫలితాలు వస్తాయి.
వృశ్చిక రాశి(♏ Scorpius (Scorpion)): వీళ్లది ఒక రకంగా చాలా విశేషమైన కాలం. గురుబలం అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. కొన్నేళ్లుగా సాగని పనులు ఇప్పుడు నెరవేరుతాయి. కాలం కలిసి వస్తుంది. దేశ, విదేశాల్లో జరిగే మార్పులు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటాయి. లబ్ధి పొందుతారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి, విద్యార్థులకు మంచి కాలం, ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. పెద్ద మొత్తంలో ధనం అందుతుంది. దీర్ఘకాల అవసరాలు తీరుతాయి.
ధనుస్సు రాశి (♐️ Sagittarius ): వీళ్లకు కొన్ని ఈక్వేషన్స్ కలిసి వస్తాయి. ఏవో లెక్కలు అటూఇటూ అయి ఉన్నత యోగం లభిస్తుంది. ఆర్థికంగా ఈ ఏడాది వీరికి తిరుగులేదు. విశేష అవకాశాలు అందివస్తాయి. అధికారులకు దగ్గర అవుతారు. అధికారం హస్తగతం అవుతుంది. విజయ యోగం ఉంటుంది. పరీక్షలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. దైవిక ఫల అనుకూలత ఉంది.
మకర రాశి (♑ Capricorn): వారికి ఇది విముక్తి నామ సంవత్సరం. ఏడున్నర సంవత్సరాల శనిపీడ నుంచి రిలీఫ్ వస్తుంది. ఉద్యోగ స్థిరత్వం, ఆరోగ్యం బాగుంటుంది. అధికారులు, యజమానులు వీరిని గుర్తిస్తారు. విదేశీ యానానికి అనుకూలమైన కాలం. స్థానమార్పులు ఉంటాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. కుటుంబ జీవితంలో చిన్న చిన్న అపశ్రుతులు ఉంటాయి. అవి అంతగా బాధించవు. మంచి యోగం ఉంది. మార్పులను స్వీకరించి తీరాలి.
కుంభ రాశి (Aquarius (♒︎)): కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వీరిమీద ప్రత్యేకంగా కొందరు వ్యక్తులు కక్ష గట్టారా అన్నట్లు ఉంటుంది. రహస్య జీవితం గడపాల్సి వస్తుంది. కోర్టు కేసులు, శత్రువుల నుంచి ఇబ్బందులు రావచ్చు. పరిస్థితులు బాగుండవు. కోలుకోవడానికి సమయం పడుతుంది. ఆశలను అదుపు చేసుకోవాలి. దీంతో ఉపశమనం పొందుతారు. ఎంత వచ్చినా సమస్యలు పూర్తిగా తీరవు. శత్రు, రుణ బాధలు ఉంటాయి. మంచి ఫలితాలు రావాలంటే… గురు గ్రహ సంబంధ శాంతి, నృసింహ స్వామి పూజలు చేయాలి.
మీన రాశి (Pisces (♓︎)): కష్టాలు ఉంటాయి. వీళ్లు మంచి చేసినా జనాల నుంచి చెడ్డ రిమార్క్ వస్తుంది. శని ఆరోగ్యాన్ని బాధిస్తాడు. కుటుంబంలో ప్రాధాన్యం కోల్పోతారు. ఒంటరి వారు అయ్యే పరిస్థితులు ఉంటాయి. మార్చి నుంచి రెండు నెలలు అటు, ఇటు ఆరోగ్య సమస్యలు, వాహన గండాలు ఉంటాయి. మృత్యుంజయ శాంతి చేసుకోవాలి. ఆరోగ్యానికి, ప్రాణానికి హాని లేకుండా ఉంటుంది.