Yadadri
Huge Devotees at Yadadri : యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం భక్తజనంతో పోటెత్తింది. మహాకుంభ సంప్రోక్షణ…ఆ తర్వాత స్వయంభూ దర్శనం కల్పించడంతో పాటు ఆదివారం కావడంతో పెద్దయెత్తున భక్తులు తరలి వచ్చారు. దాంతో ఆలయ పరిసరాలు, క్యూ కాంప్లెక్స్‌లు, ప్రసాద విక్రయ శాలలు కిక్కిరిసిపోయాయి. కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి వద్ద కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తుల సందడి కన్పించింది. ఊహించినదానికన్నా ఎక్కువమంది భక్తులు తరలి రావడంతో ఆలయ అధికారులు…వీఐపీ, బ్రేక్ దర్శనాలను రద్దు చేసి ఉచిత దర్శనం కల్పించారు. మొత్తం మీద లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి 2 గంటలు, అతి శీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతోంది.
Read More : Yadagirigutta Temple: యాదాద్రి ప్రధాన ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం
మరోవైపు యాదగిరిగుట్టలో ఆటో వాలాలు ఆందోళన చేయడంతో కొంత కలకలం రేగింది. ఓ వైపు భక్తులు పోటెత్తడం.. అదే సమయంలో ఆటో డ్రైవర్ల ఆందోళనతో మరోసారి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం మారుమోగింది. కొండపైకి ఆటోలను అనుమతించాలంటూ దాదాపు 300 మంది ఆటో డ్రైవర్లు తమ కుటుంబాలతో కలిసి ఆందోళనకు దిగారు. ఆలయ ఈవో గీతారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తమను ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆటో డ్రైవర్ల ధర్నాతో యాదగిరిగుట్టలో పెద్దయెత్తున వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
Read More : Yadadri RTC Buses : యాదాద్రి కొండపైకి వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల తర్వాత స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. 2022, మార్చి 28వ తేదీన యాదాద్రి ప్రధాన ఆలయాన్ని తెరిచారు. కృష్ణ శిలలతో ఆలయ నిర్మాణం జరిగింది. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. సాయంత్రం నుంచి ఈ దర్శనాలు ప్రారంభమయ్యాయి. స్వయం భూ మూర్తి దర్శనం మొదలైతే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు అంచనా వేసినట్లే జరుగుతోంది.