Rakhi Festival 2024 : సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు సంబంధించిన పండగగా రక్షా బంధన్ జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ పండుగ కృతయుగం నుంచి ఆచరిస్తున్నారు. ప్రతీయేటా రక్షా బంధన్ పండుగను శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తన సోదరుల చేతి మణికట్టుకు రాఖీలను కడతారు. సోదరులు కూడా సోదరీమణులకు నిత్యం రక్షణగా ఉంటానని హామీ ఇస్తూ, బహుమతి కూడా అందజేస్తారు. అయితే, ఈసారి రక్షాబంధన్ సోమవారం జరుపుకుంటున్నారు.
Also Read : Raksha Bandhan 2024: రాఖీ పండుగ రోజు అక్కాచెల్లెళ్లకు ఈ బహుమతులు ఇవ్వండి.. వారి కళ్లల్లో ఆనందం చూడండి
శాస్త్రాల ప్రకారం.. భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. ఆ సమయంలో రాఖీ కడితే అశుభం జరుగుతుందని చెబుతారు. భద్రకాలం ముగిసిన తరువాత సోదరులకు రాఖీలు కడితే మంచిదని పండితులు చెబుతున్నారు. సోమవారం భద్రకాల సమయం సూర్యోదయాన 5.33గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.33 గంటల వరకు ఉంటుంది. భద్రకాలం ముగిసిన తరువాత రాఖీ పండుగను జరుపుకోవచ్చు. మధ్యాహ్నం 1.34 గంటల నుంచి రాత్రి 9.08 గంటల వరకు శుభ సమయం ఉంటుందట. ఆ సమయంలో సోదరులకు రాఖీ కడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయని, సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
Also Read : Mark Zuckerberg : మెటా సీఈఓ మరుపురాని గిఫ్ట్.. పెరట్లో ఏకంగా భార్య ప్రిస్సిల్లా శిల్పం.. ప్రేమంటే ఇదేగా..!
ఇక్కడ మరోవాదనను కూడా పలువురు పండితులు వినిపిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.33 గంటల వరకు భద్రకాలం ఉంటుంది. కానీ, చంద్రుడు మకరరాశిలో ఉండటం వల్ల భద్రకాల నివాసం పాతాళంలో ఉంటుంది. కావున భూమ్మీద ఏ శుభకార్యముపైనా భద్రకాల ప్రభావం ఉండదని చెబుతున్నారు. అందుచేత రక్షాబంధన్ పండుగను సోమవారం రోజంతా జరుపుకోవచ్చని కొందరు పండితులు చెబుతున్నారు. రాహుకాలంలో మాత్రమే రాఖీ కట్టవద్దని సూచిస్తున్నారు.